మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. మునుగోడు నన్ను క్షమించదు అంటూ నారాయణపురం, చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం..13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అంటూ ఆ పోస్టర్లలో రాశారు. రాజగోపాల్ రెడ్డి ఫోటో ముద్రించి గోడలపై పోస్టర్లను నారాయణపురం, చౌటుప్పల్‌లో అంటించడం కలకలం రేపుతోంది.
ఈ వాల్ పోస్టర్ల వ్యవహారంపై టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. గతంలో టీఆర్ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి స్వయంగా కాంట్రాక్టర్ అని.. డబ్బులకు అమ్ముడుపోవాల్సిన అవసరం ఆయనకు లేదని బండి అన్నారు. పోస్టర్లు వేయడం మేం మొదలుపెడితే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తట్టుకోలేరని హెచ్చరించారు. మునుగోడులో ఈ నెల 21వ తేదీన అమిత్ షా భారీ బహిరంగ సభ తప్పకుండా ఉంటుందని అన్నారు. అమిత్ షా సభ వాయిదా అని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.