బండి సంజయ్ ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా దీనికి పేరు పెట్టారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్ మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాదయాత్ర కన్వీనర్ డాక్టర్ మనోహర్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం అయ్యే బండి సంజయ్ యాత్ర హుజూరాబాద్ వరకు కొనసాగనుంది. తొలిదశలో రెండు నెలల పాటు బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర మెహదీపట్నం మీదుగా షేక్‌పేటకు చేరుకోనుంది. తర్వాత రోజు గోల్కొండ కోట వద్ద జరిగే సభలో బండి సంజయ్ పాల్గొంటారు. ఆ తర్వాత చేవెళ్ల మీదుగా మన్నెగూడ, వికారాబాద్, సదాశివపేట తదితర ప్రాంతాల ద్వారా మెదక్ చేరుకుంటారు. అక్కడి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో వారం రోజుల పాటు ఆయన పాదయాత్రతో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర విజయవంతానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పాదయాత్రలో పలువురు బీజేపీ నేతలు పాల్గొనబోతున్నారు. ఈ యాత్రతో భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో కూడా పటిష్టం కానుంది.
కాస్త ఆలస్యంగా మొదలవుతున్న బండి సంజయ్ పాదయాత్ర:
ఆగస్టు 9న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలవుతుందని అందరూ భావించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేయడం, మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. అయితే ఆగస్టు నెలలోనే ఆయన పాదయాత్ర ఉంటుందని ముందుగానే బీజేపీ నేతలు చెప్పారు. చెప్పినట్లుగానే ఆగస్టు 24 నుండి పాదయాత్ర మొదలుకానుంది.