సీఎం కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే మాట నిలబెట్టుకోవాలి: బండి సంజయ్

0
762

తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ ఏడాది కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించ‌నుంది. ఈ ఏడాది తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వ‌హించేందుకు కేంద్రం నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర, కర్ణాట‌క ముఖ్య‌మంత్రులు ఏక్‌నాథ్ షిండే, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. నిజాం పాల‌న నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన సంద‌ర్భాన్ని తెలంగాణ విమోచ‌న దినంగా పాటిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ అంటే కేసీఆర్కు భయమని,అందుకే తెలంగాణ విమోచన దినం నిర్వహించడంలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారని.. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. సీఎం పీఠమెక్కిన అనంతరం మాట తప్పారని ఆరోపించారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే గతంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని సవాల్ విసిరారు.