పాదయాత్రలో అస్వస్థతకు గురైన బండి సంజయ్

0
823

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. పాదయాత్రలో భాగంగా నారాయణపేట్ మండలంలో ఉన్న ఆయన వడదెబ్బకు గురయ్యారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆయనకు వైద్యం అందించారు. నర్వ, పాతరచేడ్‌ గ్రామాల మధ్య సొమ్మసిల్లిపోయారు. దీంతో వైద్యుడు సంజయ్ చికిత్స చేశారు. ఎండల ప్రభావంతో సంజయ్ వడదెబ్బ, ఎసిడిటీకి గురయ్యారని తెలిపారు. డీహైడ్రేషన్‌, ఎసిడిటీ వల్ల బలహీనంగా ఉన్నారని, కోలుకునేంత వరకూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ తెలిపారు. అయితే బండి సంజయ్‌ మాత్రం పాదయాత్ర ఆపేదిలేదని స్పష్టం చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.

డాక్టర్ మాట్లాడుతూ, తనకు ఏదోలా ఉందని సంజయ్ చెప్పారని, వెంటనే చికిత్స అందించామని, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని చెప్పారు. రెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించానని అన్నారు. డాక్టర్ సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈరోజు ఆయన పాదయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ ల మీదుగా కొనసాగనుంది. మక్తల్ టౌన్ లో బహిరంగసభను నిర్వహించనున్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజు నారాయణపేటలో పర్యటించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే మరింత దిగజారిపోయాయని అన్నారు. కేసీఆర్ పాలనలో పేదలు విసిగిపోయారని, కేసీఆర్‌ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోయి గరీబోళ్ల ప్రభుత్వం రావాలన్నారు. అమెరికా పోయి బార్లలో, పబ్బుల్లో తిరిగేటోడికి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యారంటే అది బీజేపీ వేసిన భిక్ష అని తెలిపారు.