తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలవ్వడంతో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తనను జైలుకు పంపి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు. హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల అయ్యారు. జైలుకు ఎన్నిసార్లు అయినా పంపండని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పోలీసులు కార్యకర్తలను ఇష్టమెచ్చినట్లు కొట్టారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైందని.. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317ను ప్రభుత్వం వెంటనే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నీ గొయ్యి నీవే తవ్వుకుంటున్నావ్ అని ఆయన అన్నారు. తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరుడిగా మారాడని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లానని… అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు.
మీడియాతో మాట్లాడిన తర్వాత అరెస్టు సమయంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. పోలీసుల లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ కార్యకర్తల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు బండి సంజయ్. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.