More

  సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్

  గోదావరికి వరద పోటెత్తడం వెనుక కుట్రకోణం ఉండొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) సంభవిస్తోందని, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ఇలాగే క్లౌడ్ బరస్ట్ కు పాల్పడి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు.

  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అభివర్ణించారు. సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆయనకు మతిభ్రమించినట్టుగా ఉందని అన్నారు. తక్షణమే సీఎం కేసీఆర్ ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చి, మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తప్పిదాలతోనే కాళేశ్వరం మునిగిపోయిందని విమర్శించారు.

  కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వర్షాలు, వరదలకు అంతర్జాతీయ కుట్రలు కారణమా?… కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. క్లౌడ్ బరస్ట్ అనేది చిన్న ప్రాంతాల్లోనే వీలుపడుతుందని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

  Trending Stories

  Related Stories