ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై యుద్ధానికి సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ధాన్యం మొత్తం తామే కొంటామని వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. యాసంగి ధాన్యంలో వ్యత్యాసాలను పరిశీలించి, కొనుగోళ్లపై విధివిధానాల కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ వేసినట్టు తెలిపారు. తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొనుగోళ్లు చేపడతామని స్పష్టం చేశారు. రూ.1960 కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పారు. కొనుగోళ్లకు సంబంధించి నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని, రైతులు ధాన్యాన్ని తక్కువకు అమ్ముకోవద్దని సూచించారు. 2014 నుంచి 2022 వరకు చూస్తే తెలంగాణలో కోటి ఎకరాల మేర సాగుభూమి విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో పండించనంత పంటను తెలంగాణలో పండించడం జరిగిందని చెప్పారు. 24 గంటలు విద్యుత్ వల్ల పంటల దిగుబడులు పెరిగాయని వివరించారు. ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే, నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి గర్వంతో మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎప్పుడైనా ఆహార భద్రత కాపాడాలంటే ఆహార నిల్వలు ఉండాలి… ఇది చాలా సాధారణ అంశం.. ఇదేమీ బ్రహ్మపదార్థం కాదన్నారు కేసీఆర్. ఆహార భద్రత కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫుడ్ కార్పొరేషన్ వద్ద లక్షల కోట్ల టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. రాష్ట్రాలు పండించిన పంటను ఫుడ్ కార్పొరేషన్ సేకరించి వితరణ చేసేటప్పుడు ఓ పది వేల కోట్ల రూపాయల మేర నష్టం రావొచ్చు… దాన్ని భరించాలి.. ఆ నష్టాలను మేం భరించలేము అని చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉందని అన్నారు కేసీఆర్.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం బీజేపీ విజయమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. వరి వేస్తే ఉరే అన్న ముఖ్యమంత్రితోనే వడ్లు కొనుగోలు చేయిస్తున్నామని, ఇది బీజేపీ ఘనత అని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే వార్త అని, ఇది బీజేపీ సాధించిన విజయం అంటున్నారని తెలిపారు. ధాన్యం కొంటావా? లేక గద్దె దిగిపోతావా? అంటూ కేసీఆర్ కు తాము చేసిన హెచ్చరిక ఫలితాన్నిచ్చిందని అన్నారు. తాము చేపట్టిన దీక్ష కేసీఆర్ ను భయపెట్టిందని బండి సంజయ్ అన్నారు. సీఎం మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతున్నట్టు నిఘా వర్గాల నుంచి నివేదిక వచ్చిందని, దాంతో రైతులు తన కుర్చీ కింద పొగపెడతారని భయపడిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు ప్రకటన చేశారని అన్నారు. రైతుల కోసం బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించారని, ధర్మం కోసం తాము పోరాడామన్నారు. చెప్పినట్టే కేసీఆర్ గల్లాపట్టి ధాన్యం కొనిపించినమని సంజయ్ అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించినా తాము వెనక్కి తగ్గలేదని.. ముఖ్యమంత్రి దిగి రాక తప్పలేదన్నారు. కనీస మద్దతు ధర రూ.1960కి కొంటామని కేసీఆర్ చెబుతున్నారని.. ఆ ధర కేంద్రం చెల్లిస్తున్నదేనని సంజయ్ చెప్పారు. ఇప్పటికే తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని బండి డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరేనన్న సీఎంతోనే వడ్లు కొనిపించేలా చేశామని సంజయ్ అన్నారు.