పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ గత రెండ్రోజులుగా వర్షాన్ని లెక్కచేయకుండా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను కొనసాగించారు. అలా నడవడంతో ఆయన కుడికాలి బొటనవేలు చిట్లింది. అంతేకాకుండా ఆయన కాలు కూడా బెనికినట్లు తెలుస్తోంది. అయినా పాదయాత్ర కొనసాగించేందుకు సిద్దమయ్యారు బండి సంజయ్.
నేడు పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. పాదయాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద మొదలుపెట్టిన బండి సంజయ్, రెండో రోజున గోల్కొండ కోట దగ్గర బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభకు అనూహ్య మద్దతు లభించింది. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు పాదయాత్ర తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్ మీదుగా ఆరే మైసమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడ సభను నిర్వహించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్ నగర్ వరకూ సాగుతుంది. రాత్రి బండి సంజయ్ హిమాయత్ నగర్ లో బస చేస్తారు. రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మూడో రోజు మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.