More

    ప్రజాకంటక పాలనను ఎదిరిస్తూ.. బండి ప్రజాసంగ్రామం

    ప్రజాకంటక పాలనను అంతమొందించేందుకు.. మరికొద్ది క్షణాల్లో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. గడీల పెత్తనానికి చరమగీతం పాడేందుకు.. బీజేపీ గళమెత్తింది. టీఆర్ఎస్ ప్రాజావ్యతిరేక విధానాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమరశంఖం పూరించనున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో అశేష జనవాహినీ తోడురాగా ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పాలనకు తెరదించి.. బీజేపీ సారథ్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది.

    పాదయాత్రే ప్రజా వేదికగా మలుచుకుని.. ప్రజా సమస్యలు తెలుసుకుని.. వాటి పరిష్కారం కోసం వివిధ రూపాల్లో ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తూ.. ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజాసంగ్రామ యాత్ర ముందుకు సాగనుంది. ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలను, కుటుంబ పాలనను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే.. మరోవైపు 2023 కోసం బీజేపీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తూ బండి సంజయ్ ముందుకు సాగనున్నారు.

    ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్, ఎంపీ మునుస్వామి, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జీ మురళీధర్ రావు, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, మాజీ ఎంపీ విజయశాంతి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై బండి సంజయ్ కు సంఘీభావం తెలపనున్నారు.

    తొలిరోజు పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేములవాడ శ్రీ రాజన్న రాజన్న ఆలయ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్న బండి సంజయ్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జంట నగరాల బ్రాహ్మణ సంఘాల ఆధ్యర్యంలో పలువురు వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆశీస్సుల అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని సమరశంఖం పూరిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ప్రసంగించనున్నారు. అనంతరం తరుణ్ చుగ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు.

    భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల చెంతనుండి ఆరంభయ్యే బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మదీనా, బేగంబజార్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటుంది. అక్కడ లంచ్ కార్యక్రమం అనంతరం నాంపల్లి మీదుగా అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. సమీపంలోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి లకిడీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం మీదుగా పాదయాత్ర నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టేజీలు ఏర్పాటు చేసి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలుకుతారు.

    అనంతరం మెహిదీపట్నం సమీపంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్ లో రాత్రి బస చేయడంతో తొలిరోజు పాదయాత్ర ముగుస్తుంది. రోజుకు సగటున 10 నుండి 15 కి.మీలు నడుస్తూ దారి పొడవునా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు వినేందుకు బండి సంజయ్ సిద్దమయ్యారు. ‘జనంలోనే ఉంటా.. జనంతోనే ఉంటా.. జనం బాధలు వింటా.. జనానికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగు వేస్తా’ అనే దృఢ సంకల్పంతోనే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ తోపాటు అడుగులో అడుగు వేసి నడిచేందుకు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు.

    టీఆర్ఎస్ పాలనపట్ల విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్రపట్ల రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పాదయాత్ర తొలిరోజు కళాకారుల బృందాలు ఆటపాటలతోపాటు వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించడంతోపాటు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు. వీరితోపాటు తొలిరోజు కరీంనగర్ నుండి డోలు వాయిద్య కళాకారులు, డప్పు నృత్యాలతోపాటు పెద్ద ఎత్తున అశ్వ దళాల ప్రదర్శనతోపాటు యుద్ద సైనికుల వేషాలతో బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

    ఇదిలావుంటే, ప్రజా సంకల్ప యాత్ర కోసం నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులను బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహంతో వాటిని తొలగిస్తున్నారు. పోలీసులు సైతం పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వ పునాదులు కదిలిపోతున్నాయనే భయంతోనే కేసీఆర్ అధికారుల ద్వారా ఇలాంటి చిల్లర వేషాలు వేయిస్తున్నారని ఆరోపించారు.

    Related Stories