Telugu States

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. ఆగస్టు 9న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందని అందరూ భావించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేయడం, మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా పడింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కిషన్ రెడ్డి తొలిసారి హైదరాబాదుకు వస్తుండడంతో భారీగా స్వాగత ఏర్పాట్లకు భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. అయితే ఆగస్టు నెలలోనే బండి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీ నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.

పాదయాత్ర వాయిదా పడడానికి కారణాలను పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆగస్ట్ 9న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. కానీ పార్లమెంటు సమావేశాలు, ముఖ్యమైన బిల్లుల నేపథ్యంలో పాదయాత్రను ఈ నెల 24కు వాయిదా వేశామని తెలిపారు. ఈటల రాజేందర్ మోకాలికి ఆపరేషన్ జరిగిందని ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లో ఆయన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × three =

Back to top button