బాగుపడ్డదెవరు.. దగాపడ్డదెవరు..? కెసిఆర్ కు బండి బహిరంగ సవాల్..!

0
244

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనపై బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల మీ కుటుంబ పాలనలో బాగుపడ్డదెవరు, దగాపడ్డదెవరు.. అనే దానిపై చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్​కు​ బండి సంజయ్​ సవాల్​ విసిరారు. తెలంగాణ ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై వైట్​ పేపర్​ విడుదల చేసే దమ్ముందా అని బహిరంగ లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప కేసీఆర్​ సాధించిన ప్రగతి ఏముందని నిలదీశారు. మిషన్ కాకతీయ పథకాన్ని కమీషన్ల కాకతీయగా మార్చారని విమర్శించారు. రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్ని ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని అన్నారు. మీకు డబ్బా కొట్టేవాళ్లను మాత్రమే కవులు, కళాకారులుగా గుర్తించి పింఛన్లు ఇస్తూ.. వాస్తవాలను ప్రజల ముందుంచుతున్న వారిని పక్కన పెట్టినందుకు సాహిత్య దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు బండి. పల్లెల, పట్టణాల ప్రగతిని గాలికొదిలేశారని.. బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నేటికీ వందల గ్రామాలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 29 వేల బడుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పురుగుల అన్నమే దిక్కైందని అన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళితే ఆ ఆలయాన్ని వందల కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని, దేవుళ్లకే శఠగోపం పెట్టారని.. అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో వారి కుటుంబాలను గాలికొదిలేసి ఉద్యమ ద్రోహులతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు బండి సంజయ్. కరెంట్ చార్జీలను పెంచడమే కాకుండా ఏసీడీ చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరుతో జనంపై కేసీఆర్​ సర్కార్​ భారం మోపిందని.. ఇలా భారం మోపడమే విద్యుత్ రంగంలో కేసీఆర్​ సాధించిన విజయమా అని ప్రశ్నించారు. పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.