More

  కేసీఆర్ విమర్శలపై భారీ కౌంటర్లు వేసిన బండి సంజయ్..!

  కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని చెప్పారు. తమను లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, కూకటివేళ్లతో పెకలించివేస్తాం అని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం సాధిస్తామని, మన ప్రధానికి ఏమాత్రం దూరదృష్టి లేదని, వెరీ షార్ట్ సైటెడ్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆర్బిట్రేషన్ సెంటర్ ను అడ్డుకునేందుకు మోదీ కుట్ర చేశారని, ఈ న్యాయ కేంద్రాన్ని అహ్మదాబాద్ కు తరలించాలని చూశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. సంకుచితమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. కేంద్రం నిస్సిగ్గుగా ఎల్ఐసీని అమ్ముతోందని, ఎక్కడైనా నష్టాలు వస్తే అమ్ముతారని, కానీ లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు మోదీ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారా? అని మండిపడ్డారు. ప్రపంచ ఆహార కొరత సూచీలో భారతదేశం 101వ స్థానంలో ఉందని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ, పెట్టుబడి రెట్టింపు చేశారని విమర్శించారు. అందరికీ హౌసింగ్ అనేది పచ్చి బోగస్ అని విమర్శించారు. దేశంలో 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, అవి భర్తీ చేయకుండా సిగ్గులేకుండా తెలంగాణలో ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశం బాగుపడాలంటే బీజేపీని బంగాళాఖాతంలో పడేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మోదీ దేశానికి ప్రధాని కాదని, గుజరాత్ కు మాత్రమేనని అన్నారు. బడ్జెట్ లో జోక్ ఆఫ్ ద మ్యాటర్ అంటే నదుల అనుసంధానమేనని, నదుల అనుసంధానం చేస్తామని ఏ అధికారంతో చెప్పారని నిలదీశారు.

  కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అవమానించడం దారుణమని.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైందని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. దళిత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. బాబా సాహేబ్‌కు భారతరత్న ఇచ్చింది బీజేపీయేనన్నారు. మూర్ఖుడిని వదిలేస్తే బలుపెక్కి బరితెగిస్తారని, కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని, దేశంలో అలర్లు సృష్టించాలని అనుకుంటున్నారని బండి సంజయ్‌ అన్నారు. కొడుకును సీఎం చేయడానికే ఇదంతా చేస్తున్నారని, జైలుకు వెళ్తానన్న డిప్రెషన్‌లో ఇదంతా చేస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు.

  సీఎంగా వేల కోట్లు దోచుకుతింటున్నారని, వాటిని కూడా బయటకు తీస్తున్నామని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలన్న కేసీయార్ మాటలను తప్పుబడుతూ భారత రాజ్యాంగాన్ని కల్వకుంట్ల రాజ్యాంగంగా మార్చాలనుకుంటున్నావా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న వ్యాఖ్యలతోనే అక్కసు బయటపడిందని, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను దారుణంగా అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్ భాష చూసి తెలంగాణ ప్రజలే ఛీకొడుతున్నారని బండి సంజయ్ అన్నారు. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ వంటి నేతల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో మానసిక ఆరోగ్యం కోసం నిధులు కేటాయించిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తానే మేధావి అయితే రూ. 500 కోట్లు ముట్టజెప్పి ఒకాయనతో అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర తేలు మంత్రం ఉంటే, తమ దగ్గర పాము మంత్రం ఉందని సంజయ్ అన్నారు. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిందెవరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేక పేదలు చనిపోయినా స్పందించలేదని ఆరోపించారు. మోదీని అప్రతిష్టపాలుచేసే కుట్రలో భాగంగానే కేసీఆర్ నీచమైన, బూతు భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో వెతికితే కేసీఆర్ అని కనిపిస్తుందని, తమపై ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదని, జైళ్లు తమకు కొత్త కాదని బండి సంజయ్ అన్నారు.

  Trending Stories

  Related Stories