బండి సంజయ్ పై కుట్ర జరుగుతోంది.. కరీంనగర్‌కు వెళ్లనున్న కిషన్‌రెడ్డి

0
917

కరీంనగర్ లో జాగరణ దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్‌కి బెయిల్ ఇచ్చేందుకు కరీంనగర్ కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, బండి సంజయ్‌కి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌పై కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ తరఫు న్యాయవాది మృత్యుంజయం స్పందించారు. బెయిల్ పిటిషన్ పై హైకోర్టుకు వెళతామని తెలిపారు. బండి సంజయ్ పై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సంజయ్ కి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు.

బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందిస్తూ బండి సంజయ్ పట్ల ప్రభుత్వ తీరు సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనే కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను త్వరలోనే ప్రజలు గద్దె దించుతారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, బీజేపీ దీక్ష చేపట్టినరోజే కాంగ్రెస్ కూడా దీక్ష చేస్తుండడం అందుకు నిదర్శనం అని విజయశాంతి అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేడు కరీంనగర్‌కు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న బండి సంజయ్‌ని పరామర్శించనున్నారు. బండి సంజయ్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం బండి సంజయ్ కుటుంబసభ్యులను కిషన్ రెడ్డి కలవనున్నారు.

బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపు ఇచ్చింది. బండి సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 14 రోజులపాటు నిరసన చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. మంగళవారం కరీంనగర్ జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలపనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.