తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ సూటి ప్రశ్నలు.. సమాధానం వచ్చేనా..?

0
688

తెలంగాణలోకి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంబులెన్స్ లను అడ్డుకుంది తెలంగాణ ప్రభుత్వం. పోలీసులను బోర్డర్ లో ఉంచి ఎన్నో అంబులెన్స్ లను అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సరిదిద్దుకోలేని తప్పు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం చర్యలను హై కోర్టు కూడా తప్పుబట్టింది.
ఇక అదే హైదరాబాద్ లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్టు విషయంలో హై డ్రామా నడిచింది. ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ గుంటూరుకు చేరుకున్నారు. రఘురామ కృష్ణరాజును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఆయనపై ఐపీసీ 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రఘురామ కృష్ణరాజు అరెస్టుపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ఏపీ నుంచి అంబులెన్సుల్లో హైదరాబాద్ వస్తున్న రోగులను సరిహద్దుల వద్ద అడ్డుకోవడాన్ని.. రఘురామ అరెస్టు వ్యవహారానికి లింక్ పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. రోగులను బోర్డర్ లలో అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. ఏపీ పోలీసులను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. స్నేహితుడైన జగన్ కోసం కేసీఆర్ ఎటువంటి నిబంధనలనైనా పక్కన పెట్టేస్తారని అన్నారు. రఘురామ కృష్ణ రాజును అరెస్టు చేయాలంటే.. లోక్‌సభ స్పీకర్ అనుమతి ఉండాలని.. అలాంటిదేమీ లేకుండానే రఘురామను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కక్షకు పోలీసులను వాడుకోవడం చాలా దారుణం అని పలువురు నాయకులు విమర్శించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here