Telugu States

కేసీఆర్ ఫామ్ హౌస్ ను దున్నబోతున్నాం.. ప్రగతి భవన్ ను పేదలకు పంచుతాం: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి పైనా, టీఆర్ఎస్ పార్టీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని.. కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని.. గిరిజనుల పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ ను లక్ష నాగళ్లతో దున్ని ఆ భూములను బడుగువర్గాలకు పంచుతామని అన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే బలహీన వర్గాలకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తామని చెప్పారు. బీజీపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని సంజయ్ తెలిపారు. తొలి సంతకం ఈ ఫైల్ పైనే చేస్తామన్నారు. ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫేక్ ఐడీలు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి.. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో దళిత హక్కు పరిరక్షణకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10వేల డప్పులతో ఉద్యమిస్తామన్నారు. 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2023లో తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. కేసీఆర్ లాఠీ, పోలీసు తూటాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు.

హుజూరాబాద్ లో జరుగుతున్నది బైపోల్స్ కాదని. కేసీఆర్ బైయింగ్ పోల్స్ అని.. ఓటర్లను లోబరుచుకునేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతలను కొంటున్నారని.. ఎంత చేసినా బీజేపీ గెలుపును కేసీఆర్ అడ్డుకోలేరని అన్నారు. ఈటల బావమరిది చాటింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన నిజంగా తప్పు చేసినట్టైతే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 + 16 =

Back to top button