More

    మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్

    తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..! సైబరాబాద్ పోలీసులు భగ్నం పేట్ బషీరాబాద్ లో కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ లో పట్టుబడినవారు సుపారీ కిల్లర్స్ అని భావిస్తున్నారు. మంత్రి హత్య కుట్రలో భాగస్వామి రఘును ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో అరెస్ట్ చేశారు. కుట్ర‌లో బీజేపీ సీనియ‌ర్ నేత‌లు డీకే అరుణ‌, జితేంద‌ర్‌రెడ్డిల పాత్ర‌పై విచారిస్తామంటూ సైబరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర చెప్పారు. గురువారం నాడు డీకే అరుణ‌, జితేంద‌ర్ రెడ్డిల నివాసాల‌పై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్ప‌డ్డాయి.

    బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే అరుణ నివాసంపై దుండగుల రాళ్ల దాడికి కథ, స్క్రీన్‌ప్లే అంతా సీఎం ఆఫీస్ నుండే జరిగిందని సంజ‌య్ ఆరోపించారు. సినిమా రిలీజ్ కాక ముందే కథ అడ్డం తిరిగింద‌న్న సంజయ్… కొందరు ఐపీఎస్‌ అధికారుల తీరును చూసి కింది స్థాయి పోలీసులు అసహ్యించుకుంటున్నారన్నారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తామని, మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఏమిటి? సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రిని కాపాడబోయి సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అక్రమాలపై పూర్తి ఆధారాలతో కోర్టులు, ఎన్నికల కమిషన్‌ను.. తమ హత్యకు కుట్ర జరుగుతోందని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారో వారే హత్యకు కుట్ర పన్నారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై తప్పుడు కథనాలు రావడం బాధాకరమని బండి సంజ‌య్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవడం బీజేపీకి కొత్తేం కాదని అన్నారు. కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతామని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ పోరాటాన్ని కేసీఆర్ ఆపలేరని అన్నారు.

    నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు తన స్టేట్ మెంట్లో మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. శ్రీనివాస్ గౌడ్ 2017 నుంచి తనను చంపించేందుకు ప్రయత్నం చేశారని రాఘవేంద్రరాజు వెల్లడించాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆరోపించాడు. తనపై శ్రీనివాస్ గౌడ్ 30 కేసులు పెట్టించాడని, అందులో 10 కేసులు ఒకే రోజు పెట్టించారని వివరించాడు. వాటిలో ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని తెలిపాడు. తన బార్ ను మూసేయించి ఇబ్బందులకు గురిచేశాడని, రూ.6 కోట్ల మేర ఆర్థికంగా నష్టపరిచాడని పేర్కొన్నాడు. తనకు శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణభయం ఉందని రాఘవేంద్రరాజు తెలిపాడు.

    Trending Stories

    Related Stories