బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వగా, శనివారం కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా సంజయ్ సమాధానమిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తెలంగాణ సామెతలను ఉపయోగించానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటుందా? అని తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని బండి సంజయ్ అన్నారు. కవిత అరెస్ట్ ను ప్రస్తావించే క్రమంలోనే ఇలా అన్నానని,. ఇది మన దగ్గర వాడుకలో ఉన్న సామెతేనని చెప్పారు. తాను తప్పు చేయలేదు కాబట్టే కమిషన్ ముందు హాజరయ్యానని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో కవిత వికెట్ పడిపోయిందని, మరి కొందరు బీఆర్ఎస్ నేతలు త్వరలోనే క్లీన్ బౌల్డ్ అవుతారని చెప్పారు.