ఈ చావులకు భాద్యత నీదే దొరా.. ఈ కుటుంబాల గోస వినపడ్తుందా: బండి సంజయ్

0
709

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతున్న కలుషిత నీరుతాగి ఇద్దరు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి స్పందించిన బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

”నీ అసమర్ధ పాలానతో కనీసం గుక్కెడు మంచి నీళ్ళు ఇయ్యలేని అధ్వాన్న స్థితికి తీసుకొచ్చినవ్. నువ్వా నదులకు నడక నేర్పింది?. ప్రచారాలు చేస్కోవడంలో ఉన్న శ్రద్ధ పని మీద లేకపాయే?. ఈ చావులకు భాద్యత నీదే దొరా. ఈ కుటుంబాల గోస వినపడ్తుందా?, ఇంకెందరు బలైతే నిద్ర లేస్తవ్?” అని ట్వీట్ చేశారు.

కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందగా, మరో 50 మంది అస్వస్థతకు గురైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. గతవారం రోజులుగా జిలా కేంద్రంలో డ్రైనేజీ పనులు చేపడతున్నారు. పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా నీరు కలుషితం అవుతున్నట్లు స్థానికులు గుర్తించి మున్సిపల్‌ అధికారులు పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంటగేరి, వేదనగర్‌, ధరూర్‌ మెట్టు తదితర ప్రాంతాల్లోని కాలనీకి చెందిన ప్రజలు వాటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా దాదాపు 50 మంది పైగా వాంతులు, విరోచనాలతో గద్వాల ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న షికాల కృష్ణ, నర్సింగమ్మ పరిస్థితి విషమించడంతో బుధవారం కర్నూలు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో మరణించారు.