Telugu States

గవర్నర్ పర్యటన కారణంగా సీఎం కేసీఆర్ ఉలిక్కిపడ్డారు: బండి సంజయ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో భారీ వర్షాల వల్ల వందలాది గ్రామాలు నీట మునిగి, లక్షలాది మంది నిరాశ్రయులైతే, వారిని ఎలా ఆదుకోవాలనే ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనూ ఎంపీలతో సమావేశం పేరుతో కేంద్రంపై బురద చల్లే రాజకీయాలు చేయడం కేసీఆర్‌ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని సాయం చేయాలనే ఉద్దేశంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించగానే సీఎం కేసీఆర్‌ ఉలిక్కిపడ్డారని.. గవర్నర్ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించిన తర్వాతే సీఎం ఏరియల్‌ సర్వేకు బయల్దేరారని అన్నారు. రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతుంటే ఉద్యోగులకు జీతాలెందుకు సక్రమంగా ఇవ్వడం లేదో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను డిమాండ్‌ చేశారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. స్వయంగా అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులను గవర్నర్ పరామర్శించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకేరోజు అటు సీఎం కేసీఆర్, ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోనుండగా.. గవర్నర్ రైలు మార్గంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

Related Articles

Back to top button