Telugu States

పక్కా ప్లాన్ తోనే కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ దాడికి ప్రయత్నం: బండి సంజయ్

ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈటల రాజేందర్ విజయం కోసం బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇల్లందకుంట మండలంలో శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సిరిసేడు వద్ద బీజేపీ ర్యాలీని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. దాంతో పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. ఈ ఘటనపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఓ టీఆర్ఎస్ కార్యకర్త రెచ్చిపోయి ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు. టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాము అనుమతి తీసుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఐ, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా తాను వస్తే రక్షణ కల్పించే తీరు ఇదేనా అని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇల్లందకుంట మండలం బుజునూరు వద్ద కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మాభిమానానికి, కేసీఆర్ అహంకార ధోరణికి మధ్య జరుగుతున్న పోరాటమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని స్పష్టం చేశారు. ధర్మం ఈటల వైపే ఉందని, అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేసీఆర్ గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కిషన్ రెడ్డిపై దాడికి నిరసనగా (శనివారం) బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ తోనే ఇల్లెందుకుంటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు . టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నామన్నారు. కిషన్ రెడ్డిపై దాడి కేసీఆర్ డైరెక్షన్ లోనే జరిగిందన్నారు. టీఆర్ఎస్ ఏం చేసినా హుజురాబాద్ లో గెలవలేదన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితే హుజురాబాద్ లో రిపీట్ అవుతుందన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు క్యాడర్ లేదన్నారు. సర్వేలన్నీ హుజురాబాద్ లో బీజేపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. అందుకే ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు బీజేపీపై దాడులు చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది ఎవరో విచారణ జరపాలని ఎలక్షన్ కమిషన్ ను కోరారు. ఈ దాడిపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.

Related Articles

Back to top button