హుజూరాబాద్ లో బీజేపీకి పెరుగుతున్న ఆధిక్యం.. కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్

హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఆధిక్యం పెరుగుతూ వెళుతోంది. ఐదు రౌండ్లు ముగిసిన సమయానికి ఈటల రాజేందర్ కు 2169 ఓట్ల లీడ్ ను అందుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక్కో రౌండ్ లోనూ లీడ్ సాధిస్తూ వెళుతున్నారు.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచేది బీజేపీనే అని తాము ముందు నుంచే చెపుతున్నామన్నారు. డబ్బు, అధికారంతో ఎన్నికను గెలవాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్పారని సంజయ్ అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అణిచేలా ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ పూర్తిగా కోల్పోయారని ఆయనను జనాలు నమ్మడం లేదని చెప్పారు. పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారని, ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని అన్నారని వీటిలో ఏ ఒక్కటి చేయలేదని అందుకే కేసీఆర్ పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని బండి సంజయ్ చెప్పారు. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురబోతోందని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పారు.
ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4014 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,435 ఓట్లు, కాంగ్రెస్కు 132 ఓట్లు పోలయ్యాయి. ఐదో రౌండ్లో బీజేపీకి 344 లీడ్ రాగా, ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 20,158 ఓట్లు రాగా, బీజేపీకి 22,327, కాంగ్రెస్కు 811 ఓట్లు వచ్చాయి.
నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు, కాంగ్రెస్కు 234 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో బీజేపీకి 562 లీడ్ రాగా, నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల ముందంజలో ఉన్నారు.