More

  నెల రోజులు పూర్తి చేసుకున్న బండి సంజయ్ పాదయాత్ర.. కేసీఆర్ పై సంధించిన 10 ప్రశ్నలు

  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నెల రోజులను పూర్తి చేసుకుంది. సోమవారం నాడు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగించారు. మరో నాలుగు రోజుల్లో ఆయన మొదటివిడత యాత్ర ముగియనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్న ఈ యాత్రలో.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు సంజయ్. హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హైద్రాబాద్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. ఈ నెల రోజుల్లో రెండు రోజుల బ్రేక్ తప్ప మిగతా అన్ని రోజులు పాదయాత్ర జరిగింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు, సెప్టెంబర్ 17 అమిత్ షా సభ రోజు ఆయన యాత్ర జరగలేదు. సంగ్రామ యాత్రలో భాగంగా ఇప్పటివరకు సుమారు నాలుగు వందల కిలోమీటర్లు నడిచారు బండిసంజయ్. అక్టోబర్ 2తో సంజయ్ మొదటి విడత యాత్ర ముగియనుంది. ఉపఎన్నిక జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్రను ముగించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తూ ఉంది.

  టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ కు ఆయన 10 ప్రశ్నలను సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి ట్విట్టర్ లో పోస్టు పెట్టారు బండి సంజయ్.

  బండి సంజయ్ సంధించిన 10 ప్రశ్నలు ఇవే:

  కేసీఆర్ జమానా అవినీతీ ఖజానా అని సకల జనులు ఘోషిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ అవినీతి భవన్ గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందనేది వాస్తవం. దీనికి మీ సమాధానం ఏమిటి?
  దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్ అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  2014లో సీఎం అయ్యే సమయానికి మీవి, మీ కుటంబసభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడున్న ఆస్తులు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?
  పాలమూరు-రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. వీటికి సంబంధించిన ఫైల్స్ అఖిలపక్షం ముందు పెట్టి బహిరంగంగా చర్చించడానికి మీరు సిద్ధమా?
  కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా? లేదా? దీనికి మీ సమాధానం ఏమిటి?
  ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను అవినీతి సొమ్ముతో మీరు సంతలో పశువుల్ని కొన్నట్టు కొనలేదా?
  బంగారు తెలంగాణ లక్ష్యమని చెప్పిన మీరు… అక్రమ మార్గాల ద్వారా కోట్లు కొల్లగొట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ పార్టీ నేతలను బంగారుమయం చేశారా? లేదా? ఇదే సమయంలో ప్రజలను బికారులుగా మార్చిన ఘనత మీది కాదా?
  మీరు సీఎం అయిన తర్వాత ఓటుకు నోటు పథకాన్ని ప్రవేశపెట్టి… సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న మాట నిజం కాదా?
  మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, డ్రగ్స్, లిక్కర్, భూకబ్జా దందాలపై దర్యాప్తు జరిపించి అవినీతి, అక్రమాలు జరగలేదని మీరు నిరూపించగలరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

  బాధ్యతగల పార్టీగా రేపు మరిన్ని ప్రశ్నలను సంధిస్తామని చెప్పారు.

  Image

  Trending Stories

  Related Stories