More

    ఆంధ్రప్రదేశ్ లో ఇకపై చింతామణి నాటకం ప్రదర్శించకుండా నిషేధం

    చింతామణి నాటకం.. మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రచించారు. సినిమాలు, టీవీలు లేని కాలంలో ఈ నాటకం ఎంతగానో ఫేమస్.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈ చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా వ్యసనాల వైపు మళ్లించేలా నాటకం ఉందని, దీన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు. వారి వాదనలను విన్న ప్రభుత్వ పెద్దలు.. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏడాది క్రితమే చింతామణి నాటకం ప్రదర్శనలను నిషేధించాలంటూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు.

    చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే వచ్చింది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడింది ఈ నాటకం. ఒకప్పుడు ‘చింతామణి’ ఈ నాటకం వేస్తున్నారంటే జనాలు ఎగబడేవారు. ఈ చింతామణి నాటకం మొదటి ప్రదర్శన వేసి గతేడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ నాటక శతజయంతి వేడుకలపై తీవ్ర వివాదం నెలకొంది. చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరికునేది లేదని ఆర్యవైశ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చింతామణి శతజయంతి వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చింతామణి నాటకంలో ‘సుబ్బిశెట్టి’ ప్రధాన పాత్ర. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడో ఇందులో ఉంటుంది. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు.

    Trending Stories

    Related Stories