భారత్ నెక్స్ట్ టార్గెట్ ‘హువావే’..?
కొత్త టెలికాం నిబంధనలతో చైనాకు ఇక చుక్కలే..!

0
856

చైనా వస్తువలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో వస్తువులు, అప్లికేషన్లను క్లోజ్ చేసింది. ముఖ్యంగా టెలికాం భద్రతకు ముప్పుగా పరిణమించిన.. చైనా టెలికాం ఎక్విప్ మెంట్ విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా మొబైల్‌ ఏకోసిస్టమ్‌ భద్రతను మరింత పటిష్ఠపరిచేందుకు టెలికాం లైసెన్స్‌ నిబంధనలకు సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. జూన్‌ 15 నుంచి దేశీయ టెలికాం కంపెనీలు.. డిజిగ్నేటెడ్‌ అథారిటీ అనుమతించిన ఎక్విప్‎మెంట్‎నే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల 4జీ, 5 జీ మార్కెట్ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆరాటపడుతున్న జిత్తుమారి చైనాను ముక్కుతాడు పడనుంది. దేశంలో కీలకమైన టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చైనా పాత్ర పెరిగిపోవడం వల్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. డేటా సెక్యూరిటీ పైనా నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో చైనీస్‌ కంపెనీల నుంచి టెలికాం నెట్‌వర్క్‌ గేర్లను సమకూర్చుకోవడంలో నెమ్మదిగా వ్యవహరించాలని టెలికాం శాఖ చెబుతున్నా.. కొన్ని భారత మొబైల్‌ టెలికాం ఆపరేటర్లు తమ విధానాన్ని కొనసాగిస్తుండటం పట్ల కేంద్రం అసంతృప్తితో ఉంది. దీంతో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.

భారత ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త నిబంధనలతో చైనాకు చెందిన జెడ్‌టీఈ, హువావే వంటి కంపెనీలు దేశంలో 4జీ విస్తరణ, 5జీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి టెలికాం కంపెనీలు 4జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. మరోవైపు రాబోయే ఆర్థిక సంవత్సరంలో 5జీ వేలం నిర్వహించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న తాజా సవరణలు వార్షిక నిర్వహణ కాంట్రాక్టులు లేదా నెట్‌వర్క్‌లోకి ఇప్పటికే తీసుకున్న ఎక్విప్‎మెంట్ అప్‌డేషన్‌ను ప్రభావితం చూపవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇకపై టెలికాం కంపెనీలు మాత్రం నమ్మకమైన ఉత్పత్తులను మాత్రమే తమ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే, టెలికాం సవరణల్లో భాగంగా భారత్‌ రూపొందించే ‘నో ప్రొక్యూర్‌మెంట్‌’ నిషేధిత జాబితాలో హువావే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హువావే తయారు చేసిన టెలికాం ఎక్విప్‎మెంట్‌ను భారత టెలికాం కంపెనీలు వినియోగించకుండా పూర్తి నిషేధం విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

హువావేతో పాటు జ‌డ్‌టీఈ కంపెనీ త‌మ హార్డ్‌వేర్‌ల‌లో బ్యాక్‌డోర్ వ‌ల్న‌ర‌బిలిటీస్‌ను ఇన్‌స్టాల్ చేసి వాటిని భార‌త్‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నాయ‌ని, వాటి స‌హాయంతో చైనా భార‌త టెలికాం కంపెనీల ద్వారా భార‌తీయుల‌పై నిఘా పెడుతుంద‌ని తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్త టెలికాం నిబంధనల ప్రకారం తొలి వేటు పడేది ఈ రెండు కంపెనీలపైనేనని సమాచారం. నిషేధం గ‌న‌క అమ‌లులోకి వ‌స్తే అప్పుడు ఆ రెండు కంపెనీల‌కు భారీ మొత్తంలో న‌ష్టం సంభ‌విస్తుంద‌ని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హువావే తయారు చేసే టిలికాం ఎక్విప్‎మెంట్‎లో ఇప్పటికే ఎన్నో లొసుగులు బయటపడ్డాయి. దీంతో ఎన్నో దేశాలు ఆ కంపెనీపై ఇప్పటికే నిషేధం విధించాయి. మొబైల్ ఫోన్ల తయారీలో హువావేకు ప్రపంచంలనే నెంబర్ టూ కంపెనీగా పేరుంది. అలాగే, భారీ సమాచార వ్యవస్థ పరికరాలను కూడా ఈ చైనా దిగ్గజ కంపెనీ తయారు చేస్తోంది. హువావే సంస్థకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా సైనిక పరికరాలతో సంబంధముందని గతంలో అమెరికా ఆరోపించింది. ఆరోపించడమే కాదు.. ఆ కంపెనీపై అప్పట్లో ట్రంప్ సర్కార్ నిషేధం కూడా విధించింది ఇప్పుడు భారత్ కూడా హువావేను బ్లాక్లిస్ట్‌ జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nineteen − 12 =