రక్తపుటేరులు పారిస్తున్న పాకిస్థాన్ పై బలూచిస్థాన్ అప్రతిహత యుద్ధం

0
965

రక్తపుటేరులు పారిస్తున్న పాకిస్థాన్ పై బలూచిస్థాన్ అప్రతిహత యుద్ధాన్ని ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి పాకిస్థాన్ సైన్యంపై వరుస దాడులు చేస్తోంది. బలూచ్ ప్రజల సహనాన్ని నిత్యం పరీక్షిస్తున్న ఉగ్రదేశం పాకిస్థాన్ కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఫిబ్రవరి 2,3 తేదీల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడుల్లో సుమారు వందమందికి పైగా పాక్ సైనికులు హతమైనట్టూ వార్తలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ మాత్ర నోరు మెదపడం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటన నేపథ్యంలో బలూచిస్థాన్ తిరుగుబాటు మరింత తీవ్రమవడం ఆసక్తికరమైన పరిణామం.
బలూచ్ విముక్తి సైన్యం-బీఎల్ఏ పాకిస్థాన్ సైన్యంపై ఎందుకు దాడులకు దిగుతోంది? బలూచిస్థాన్ అస్థిరతకు కారణమెవరు? బలూచిస్థాన్ ప్రజలు సీపెక్-చైనా పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు ఎలా అందుతున్నాయి? తాలిబన్లకు, బలూచ్ తిరుగుబాటుదారులకు నిజంగానే సంబంధాలున్నాయా? బలూచిస్థాన్ భూభాగంలో చైనా సైన్యం తిష్ఠవేసిందా?
ఇలాంటి అంశాలకు సంబంధించిన విశ్లేషణాతో కూడిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను.
పాకిస్థాన్ చైనా పంచన చేరాక బలూచిస్థాన్ లో అగ్గిరాజుకుంది. కాలుమోపిన ప్రతిచోటా సహజ సంపదను దోచుకునే డ్రాగన్ కన్ను బలూచిస్థాన్ పై పడింది. దీంతో స్థానికుల్లో వ్యతిరేకత క్రమంగా పెరిగింది. సీపెక్ పేరుతో చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ పనులు ఊపందుకోవడంతో వ్యతిరేకత కాస్త మరోసారి సాయుధ తిరుగుబాటు రూపం తీసుకుంది. గతంలో సాయుధ తిరుగుబాట్లు చెలరేగిన దాఖలాలు ఉన్నా….అవి తాజా దాడులకు భిన్నమైనవి. మారిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో బలూచ్ తిరుగుబాటుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

బలూచిస్తాన్ లిబరేషన్‌ఆర్మీ 1970ల నుంచి ఉనికిలోకి వచ్చింది. మాజీ ప్రధాని జుల్ఫికర్‌అలీ భుట్టో పాలనకు వ్యతిరేకంగా బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. అయితే సైనిక నియంత జియా ఉల్‌హక్‌అధికారం చేపట్టాక బలూచ్‌నాయకులతో చర్చలు జరిగాయి. ఫలితంగా సాయుధ తిరుగుబాటు ముగిసింది. ఆ తర్వాత కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తెరమరుగైంది.
బలూచిస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి నవాజ్‌మిరి ని హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి బలూచ్ నాయకుడు నవాజ్‌ఖైర్‌బక్ష్‌మిరీని పర్వేజ్‌ముషారఫ్‌ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు బలూచ్ జాతీయవాదులు చెలరేగిపోయారు. పాకిస్థాన్ ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై దాడులు జరిగాయి. 2000 సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ దాడులు కాలం గడుస్తున్న కొద్దీ దాడులు పెరగడమే కాక, బలూచిస్తాన్ అంతటా వ్యాపించాయి.
బలూచ్ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ భూభాగం నుంచి కాకుండా యూరప్‌నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఈ సంస్థను ఉగ్రవాద గ్రూపుగా పాకిస్థాన్ ఇంతకు ముందే గుర్తించింది. పాక్, చైనా సైనిక బలగాలపై దాడులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. నవంబర్ 2018న కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో చైనా కాన్సులేట్‌పై దాడి జరిగింది.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ దీనికి తానే బాధ్యురాలినని ప్రకటించుకుంది. ఈ ఘటనలో 7గురు మరణించారు. బలూచ్ వేర్పాటువాదులు చైనాను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు 2018 ఆగస్టులో కూడా బిఎల్‌ఎ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అంగీకరించింది. పాకిస్థాన్‌లో ఈ ప్రాజెక్టును రక్షించడానికి ప్రత్యేక సైన్యాన్ని కూడా సిద్ధం చేసింది చైనా. ఒక దేశం మరో దేశంలో తన పెట్టుబడులను రక్షించుకోడానికి సైన్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
చైనా ప్రతిపాదనను పాకిస్తాన్‌కూడా అంగీకరించింది. స్పెషల్‌సెక్యూరిటీ డివిజన్‌అని పిలిచే డ్రాగన్ సైన్యం చైనా ప్రజలను, చైనా వస్తువులు, ప్రాజెక్టులను రక్షించడానికి అక్కడ సిద్ధంగా ఉంది. చైనాపై బలూచ్ వేర్పాటువాదులు ఆగ్రహానికి మరో ప్రధాన కారణం.
గతేడాది నుంచీ బలూచ్ ప్రజలు చైనా వ్యతిరేక ఆందోళనలను తీవ్రం చేశారు. గ్వాదర్ రేవుపై క్రమంగా పట్టుసాధిస్తున్న డ్రాగన్ వనరుల వేటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతేడాది జూన్‌లో వందల కొద్దీ చైనా చేపల వేట పడవలు పాక్‌బలోచిస్థాన్‌లోని గ్వాదర్‌పోర్టుకు చేరుకొన్నాయి. దీంతో స్థానిక మత్స్యకారులు ఆగ్రహోదగ్రులయ్యారు. అందుకు ప్రధాన కారణం చైనా చేపల వేట పడవలు యుద్ధనౌకలంత భారీ స్థాయిలో ఉంటాయి.
అంతేకాదు, గ్వాదర్‌ పోర్టుకు కొత్త యంత్రాలు వస్తున్నాయి. రోడ్లు, కొత్త భవనాలు,కాలనీలు నిర్మిస్తున్నారు. కానీ గ్వాదర్‌వాసులు మాత్రం మంచి నీటి కోసం అల్లాడిపోతున్నారు. నగరంలో ఆకాడ్ ఆనకట్ట నుండి ఏడాది మొత్తంలో కొన్ని వారాలు మాత్రమే మంచి నీరు అందుతుంది. ఇది స్వచ్ఛమైన నీరు లభించే ఏకైక వనరు.
స్వయంగా పాకిస్థాన్ ప్రసార మాధ్యమాలు చైనా పడవలు చేపల వేటను చేపట్టిన ఫొటోలను ప్రచురించాయి. ఈ పడవలు మొత్తం ఒకే చేపల ఎగుమతి సంస్థకు చెందినవిగా గుర్తించాయి. గ్వాదర్‌ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికుల ఉపాధిపై డ్రాగన్ పట్టుబిగించడంతో బలూచిస్థాన్ లో చైనా వ్యతిరేక మరింత తీవ్రమైంది.
గ్వాదర్‌పోర్టును చైనా కంపెనీలకు 40ఏళ్లపాటు లీజుకు ఇవ్వడంతో డ్రాగన్ పాక్‌ఎకనామిక్‌కారిడార్‌ప్రాజెక్టు ఉన్న గ్వాదర్‌సిటీ చుట్టూ చైనా ఏకంగా 10 అడుగుల ఎత్తున 30 కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. సుమారు 9 వేల మంది పాక్‌సైనికులు, 6 వేల మంది చైనా బలగాలు గ్వాదర్ లో మోహరించాయి .
గడచిన ఏడాది సెప్టెంబర్ లో ఖైద్ ఏ ఆజమ్ మహమ్మద్ ఆలీ జిన్నా విగ్రహం పేల్చివేత ఘటనతో బలూచ్ ప్రజల తిరుగుబాటు మరో కీలక మలుపు తీసుకుంది. విగ్రహ విధ్వంస ఘటన బలూచిస్తాన్ తీర ప్రాంత నగరం గ్వాదర్‌లో చోటుచేసుకుంది. పాకిస్తాన్ జాతిపితగా పేర్కొనే జిన్నా విగ్రహాన్ని పేల్చివేసింది తామేనని తీవ్రవాద సంస్థ నిషేధిత బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ ప్రకటించింది. గ్వాదర్ నగరంలో అత్యంత సురక్షితమని భావించే ప్రాంతంలో జిన్నా విగ్రహంను పేల్చేయడంతో అంతర్జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు వెలువరించింది.
గ్వాదర్‌లో జిన్నా విగ్రహాన్ని పేల్చేయడం అనేది పాకిస్తాన్ ఐడియాలజీపైనే దాడి లాంటిదనీ…. జిన్నా ఇంటిపై దాడి చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించామో, ఈ విగ్రహం పేల్చేసినవారికి కూడా అదే శిక్ష వేయాలని భావిస్తున్నట్టూ పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని తలపించే ప్రకటన చేసింది. 2013 జూన్‌లో జియారత్‌లోని మొహమ్మద్ అలీ జిన్నా ఇంటిని బాంబుతో పేల్చేశారు.
జియారత్ బలూచిస్తాన్‌లోనే ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లోని ఫర్నీచర్ కాలిపోయింది. జిన్నా తన చివరి రోజుల్ని ఈ ఇంట్లోనే గడిపారు. ఆయన చనిపోయాక ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేశారు. బలూచిస్తాన్‌ను పాకిస్తాన్‌లోనే అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా భావిస్తారు. బలూచిస్థాన్ పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్. కానీ, పాకిస్తాన్‌లో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడిన ప్రావిన్సుల్లో ఇది కూడా ఒకటి.
డెబ్భయ్యవ దశకంలో పాకిస్తాన్ జీడీపీలో బలూచిస్తాన్ భాగస్వామ్యం 4.9 శాతంగా ఉండేది. ఇది 2000లో 3 శాతానికి పడిపోయింది. వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం పాకిస్తాన్‌కు చాలా కీలకం. బలూచిస్తాన్‌ప్రావిన్స్ లోని 760 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, పాకిస్తాన్‌మొత్తం తీర ప్రాంతంలో మూడింట రెండు వంతులని అంచనా.
పాకిస్థాన్ సైన్యానికి సంబంధించిన మీడియా విభాగం ఫిబ్రవరి 7న నిస్సిగ్గుగా ఓ ప్రకటన చేసింది. ‘‘Balochistan attackers’ handlers based in Afghanistan, India’’ అంటూ ఈ ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ ఆయుధాలు బలూచ్ తిరుగుబాటు దారుల చేతుల్లోకి రావడం వల్లే తాజా దాడుల తీవ్రత పెరిగిందని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆహమ్మద్ కూడా ప్రకటించారు. బలూచిస్థాన్ లోకి తాలిబన్ల ఆయుధాలు రవానా అవుతుంటే పాకిస్థాన్ ఏం చేస్తోందనే సందేహాలు వస్తున్నాయి. పంజ్ గూర్, నౌష్కీ పట్టణాలు కేంద్రంగా బలూచ్ విముక్తి సైన్యం తాజా దాడులను ముమ్మరం చేసింది.
బలూచిస్థాన్ ఆస్థిరతకు కారణం భారతదేశమనీ, బలూచ్ తిరుగుబాటును భారత అంతర్జాతీయ నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’-RAW ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్ దశాబ్దాలుగా అర్థరహిత ఆరోపణలు చేస్తోంది. బలూచ్ ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమించినపుడు భారత్ మద్దతు ఇచ్చింది. అంతమాత్రాన తిరుగుబాటు ప్రోత్సహిస్తోందనడం అభూత కల్పన అని భారత్ పదే పదే అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు సరఫరా చేస్తున్నది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్-TTP అనే ఆరోపణలూ ఉన్నాయి. టీటీపీని పాకిస్థాన్ గతంలోనే నిషేధించింది. “Baloch militants are usually involved in scattered target killings and roadside bombings. Now we’re seeing suicide bombings and skilled attacks on military camps,” అంటూ విశ్లేషించారు ‘మషాల్ రేడియో’లో పనిచేసే దావూద్ ఖతక్ అనే పాత్రికేయుడు.
గతంలో చెదురుముదురు ఘటనలకు, రోడ్డువారన బాంబుదాడులకు పాల్పడే బలూచ్ తిరుగుబాటు దారులు తాజాగా ఆత్మహుతి దాడులు చేస్తున్నారు. పాకిస్థాన్ సైనిక స్థావరాలపై నైపుణ్యంతో కూడి దాడులు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
డురాండ్ సరిహద్దుల్లోని తెగల సాయంతో భారీ దాడులకు పాల్పడే తెహరీక్ తాలిబాన్ పాకిస్థాన్ సంస్థ గతేడాది ఆఖరు వారంలో భారీ ఎత్తున పేలుడు సామాగ్రీని బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చేరవేసినట్టూ ఆలస్యంగా గుర్తించాయి పాకిస్థాన్ నిఘా సంస్థలు.
అంతేకాదు, ఇరాన్ కేంద్రంగా పనిచేసే ‘‘జుందుల్లా’’-the People’s Resistance Movement of Iran నుంచి కూడా బలూచ్ తిరుగుబాటుదారులకు సహాయ సహకారాలు అందుతున్నాయని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. బలూచిస్థాన్ ఇరాన్ తో సుమారు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. సున్నీ తీవ్రవాద సంస్థ అయిన జుందుల్లా బలూచ్ తిరుగుబాటు సంస్థలను ఐక్యం చేసే ప్రయత్నాలను ఇటీవలి కాలంలో ముమ్మరం చేసింది.
తాజా దాడుల నేపథ్యంలో బలూచ్ జాతీయవాదులపై అణచివేత చర్యలు తీవ్రం చేసింది పాకిస్థాన్. బలూచ్ జాతీయవాద పాత్రికేయుడు బహత్ బలూచ్ ట్విటర్ ఖాతాను నిలిపేసింది. బీఎల్ఏ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ ట్విటర్ ఖాతాను నిలిపివేయడంతో పాటు బలూచిస్థాన్ తిరుగుబాటు గురించి ఎలాంటి వార్తలు రాయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

‘‘Is a rift between Pakistan and the Afghan Taliban imminent?’’ శీర్షికన అల్ జజీరా వెబ్ సైట్ ఫిబ్రవరి 6న ఓ కథనాన్ని ప్రచురించింది. డురాండ్ సరిహద్దు వెంబడి తీవ్రమవుతున్న తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ కార్యకలాపాలు, టీటీపీకి తాలిబన్ల మద్దతు నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ ల మధ్య బంధం బెడిసికొట్టే అవకాశాలు బలంగా ఉన్నాయని ఈ కథనం పేర్కొంది.
అమెరికా సేనల ఉపసంహరణ-తాలిబన్లు అధికారాన్ని చేపట్టిన తొలిరోజుల్లో విందులు చేసుకున్న పాకిస్థాన్ తాలిబాన్ల రాక ప్రమాద ఘంటిక అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డురాండ్ సరిహద్దు వివాదానికి తోడు, టీటీపీ కార్యకలాపాలు తీవ్రమవడం, తాలిబాన్ అందుకు మద్దతు తెలపడం పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాల్లో అనిశ్చితికి కారణమయ్యాయి.
తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టాక ఆఫ్ఘన్ జైళ్లలో మగ్గుతున్న టీటీపీ ఉగ్రవాదులను విడుదల చేయడంతో సదరు ఉగ్రసంస్థ బలం మరింత పెరిగింది. పాకిస్థాన్ సహా, బలూచిస్థాన్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు పథక రచన చేస్తున్న ఆఫ్ఘనిస్థాన్ లో తిష్ఠవేసి టీటీపీ నేతలే అని ఆరోపిస్తోంది పాకిస్థాన్.
ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు మిగతా దేశాలకంటే పాకిస్థాన్ కే అతి తక్కువ కాలంలో సమస్యగా మారాయి. భౌగోళిక రాజకీయాల వ్యూహాత్మక దృష్టి లోపించిన పాకిస్థాన్ తలాతోక లేని విధానాలు అనుసరించడమే బలూచిస్థాన్ అనిశ్చితికి ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో చైనా జోక్యం పెరిగే కొద్దీ పాకిస్థాన్ మరింత సంక్షోభం లోకి నెట్టబడటం ఖాయం. బలూచ్ ప్రజల తిరుగుబాటు మరింత బలం పుంజుకుంటే…పాకిస్థాన్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.