Sports

ఇంగ్లండ్ జట్టుపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు

భారత్-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేగింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ బూట్ల కింద బంతిని పెట్టి ఉంచడంతో బాల్ టాంపరింగ్ కలకలం మొదలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు మొదలయ్యాయి. బంతిని బూట్ల కింద ఉంచి అదుముతున్నట్టుగా ఉన్న మూడు ఫొటోలు వైరల్ అవుతుండగా, ఆ ఆటగాళ్లు ఎవరనేది తెలియరావడం లేదు.

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. ఇది బాల్ ట్యాంపరింగా? లేక, కరోనా నివారణ చర్యా? అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ‘ఇది బాల్ ట్యాంపరింగేనా?’ అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. 2018 నాటి కేప్‌టౌన్ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు శాండ్ పేపర్‌ను ఉపయోగించి బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు యత్నించారు. ఈ వివాదంలో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు.

లార్డ్స్ టెస్ట్ లో ఇంగ్లండ్ కాస్త దూకుడును ప్రదర్శిస్తూ ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 27 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. భారత రెండో ఇన్నింగ్స్‌ లో వుడ్‌ తన వరుస ఓవర్లలో రాహుల్‌ (5), రోహిత్‌ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను పెవిలియన్‌ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు. మూడు వికెట్లు పడగానే.. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్‌లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే అర్ధ సెంచరీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్‌ వుడ్‌ పుజారాను ఔట్‌ చేశాడు. తర్వాత మొయిన్‌ అలీ స్వల్ప వ్యవధిలో రహానే, రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత పంత్, ఇశాంత్ శర్మ మరో వికెట్ పడకుండా స్పిన్నర్లను అడ్డుకున్నారు. వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్ ను ముందుగానే నిలిపేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా 14 పరుగులతో ఆడుతున్న పంత్ టెయిలెండర్స్ తో కలిసి ఎలా ఆడుతాడో అనే విషయంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 4 =

Back to top button