సోషల్ మీడియాలో అతి చేష్టలు ఒక్కోసారి హద్దు దాటిపోతుంటాయి. ఆ సమయంలో విమర్శలు వచ్చినా.. తమను తాము సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలో.. ఒకావిడకు అలాంటి అవకాశం లేకుండా చేశారు ఇండోనేషియా వాసులు.
ఇండోనేషియాలోని బాలీ ప్రాంతంలో ఉన్న 700 ఏళ్ల క్రితం నాటి పవిత్ర మర్రి వృక్షం వద్ద ఓ రష్యా టూరిస్టు నగ్నంగా ఫోటో షూట్ చేసింది. ఆ వృక్షం వద్ద అలీనా ఫజ్‌లివా దిగిన నగ్న ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన పట్ల స్థానిక బాలీ తెగ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్యా టూరిస్టు అలీనా, ఆమె భర్త స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తబనాన్ జిల్లాలో ఉన్న ఓ ఆలయంవద్ద ఉన్న 700 ఏళ్ల క్రితం నాటి మర్రి వృక్షం ముందు ఫోటో షూట్ చేయడం పట్ల అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. భర్త ఆండ్రీ ఫజ్‌లివా ఆ ఫోటోను తీశాడు. ఇండోనేషియా పోలీసులు ఆ జంటను దేశం నుంచి ఆర్నెళ్ల పాటు వెలివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బాలీలోని హిందూ, బౌద్ధ సాంప్రదాయాన్ని పాటిస్తున్న ప్రజలు అక్కడి కొండలు, వృక్షాలు, సహజ వనాలను దేవతలుగా భావించి పూజిస్తారు. అయితే అలాంటి పవిత్ర ప్రదేశంలో రష్యా జంట అక్రమరీతిలో ప్రవర్తించినట్లు బాలీ ఇమ్మిగ్రేషన్ అధికారి ఆరోపించారు. అందుకే వాళ్లను డిపోర్ట్ చేస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. డిపోర్టేషన్‌తో పాటు ఆ వృక్షం వద్ద శుద్ది కూడా చేయాల్సి ఉంటుంది. దాని కోసం అయ్యే ఖర్చు మొత్తం ఆ జంట భరించాల్సి ఉంటుంది. పవిత్ర వృక్షం వద్ద తప్పు చేసినట్లు అలీనా తన ఇన్‌స్టాలో అంగీకరించారు. టూరిస్టులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు.
ఇదిలా ఉండగా.. ఇండొనేషియాలోనే పోయిన నెలలో కెనడా నటుడు ఒకడు.. నగ్నంగా బటూర్ పర్వతంపై సంచరించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. అతన్ని కూడా అరెస్ట్ చేయకుండా హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. గత ఏడాది బాలీ దీవుల్లో కోవిడ్ నియమావళి ఉల్లంఘించిన సుమారు 200 మందిని డిపోర్ట్ చేశారు.