కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ కు తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉండేది. ముఖ్యంగా నందమూరి కుటుంబంతో రాజ్ కుమార్ కుటుంబానికి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. గతంలో పలు ఈవెంట్లలో బాలకృష్ణతో కలిసి పునీత్ రాజ్ కుమార్ కనిపించారు. పునీత్ మరణ వార్త తనను కలచివేసిందని బాలకృష్ణ సోషల్ మీడియాలో తెలిపారు. ఈరోజు బెంగళూరుకు వెళ్లారు బాలకృష్ణ. కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని దర్శించుకున్నారు. పునీత్ భౌతికకాయాన్ని చూసిన వెంటనే బాలయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ బాలయ్యను హత్తుకున్నారు. బాలయ్య అక్కడ ఉన్నంతసేపూ కళ్లు తుడుచుకుంటూనే ఉన్నారు.
46 ఏళ్ల వయసులోనే పునీత్ తనువు చాలించడం అందరినీ కలచి వేస్తోంది. ఆయన గౌరవార్థం బెంగళూరు నగరం షట్ డౌన్ అయిపోయింది. పునీత్ కు నివాళి అర్పిస్తూ నగరంలోని షాపులను ఎవరికి వారు మూసివేశారు. అభిమానుల సందర్శనార్థం నగరంలోని కంఠీరవ క్రికెట్ స్టేడియంలో పునీత్ పార్థివదేహాన్ని ఉంచారు. ఆయనను చివరిసారి చూసుకునేందుకు వేలాదిమంది స్టేడియంకు తరలి వస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే అక్కడకు అనుమతి ఉంది. సామాన్య ప్రజలను అనుమతించరు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి పునీత్ రాజ్ కుమార్ కుమార్తె వందిత తిరిగి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వందిత ఈరోజు సాయంత్రం బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది.
