More

    పట్టాభికి బెయిల్.. టీడీపీ కార్యాలయం, పట్టాభి నివాసంపై దాడులకు పాల్పడిన నిందితుల అరెస్ట్

    జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా, పట్టాభి ఇంటిపైనా దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందిని, పట్టాభి నివాసంపై దాడి ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై పల్లపు మహేశ్, గోక దుర్గాప్రసాద్, షేక్ అబ్దుల్లా, శేషగిరి, పానుగంటి చైతన్య, జోగ రమణ, పేరూరి అజయ్, అడపాల గణపతి, కోమటిపల్లి దుర్గారావు, పవన్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పడమట పోలీసులు.. పదకొండు మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పదకొండు మంది విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేశామని.. దాడి జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆధారంగా 11 మంది అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ ను పోలీసులు విడుదల చేశారు. పట్టాభి ఇంటిలోని సీసీ ఫుటేజీ డీవీఆర్ ఇవ్వమని కోరామని డీవీఆర్ అందిన తర్వాత విచారణ మరింత వేగవంతం చేస్తామని పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.

    Trending Stories

    Related Stories