దేశ ద్రోహ చర్యలకు పాల్పడ్డారాన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన దిశరవికి బెయిల్ లభించింది. టూల్కిట్ వ్యవహారంలో దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నారన్న కోణం దిశ రవి అరెస్టయింది. ఈ మేరకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. సహ నిందితులు నికత జాకబ్, శంతను ములుక్తో కలిపి ప్రశ్నించారు. ఇప్పటికే జాకబ్, ములుక్.. సోమవారం విచారణ ఎదుర్కొన్నారు. ద్వారకలోని ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఆఫీసులో ఇరువురినీ పోలీసులు ప్రశ్నించారు. ఇక పర్యావరణ కార్యకర్త శంతను ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టుకు వెళ్లారు.
భారతదేశంలో రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన ‘టూల్‌కిట్’ మీద నమోదైన కేసులో దిశా రవిని ఈ నెల 13న బెంగళూరులో దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఫిబ్రవరి 20న విచారణ జరిపిన తర్వాత తమ తీర్పును రిజర్వులో పెట్టింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. దిశ రవి టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్ ఎడిటర్. ఈ డాక్యుమెంట్‌ను తయారు చేయడంలోనూ, ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఖలిస్తాన్ మద్దతుదారు ‘పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు. దిశనే ఈ టూల్‌కిట్‌ను గ్రేటా థన్‌బర్గ్‌తో పంచుకున్నారు. ఈ టూల్‌కిట్ రూపొందించడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను కూడా దిశ ఏర్పాటు చేశారు. టూల్ కిట్ పైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారని ఢిల్లీ కోర్టులో పోలీసులు చెప్పారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర ఉందని” పోలీసులు పేర్కొన్నారు.