Telugu States

బద్వేల్ ఉపఎన్నిక పోటీ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయాలివే

బద్వేల్ ఉప ఎన్నిక.. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటిస్తారు. బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకుని కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. అయితే, మళ్లీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు.

పోటీ చేయడం లేదని తెలుగు దేశం పార్టీ తెలిపింది. బద్వేల్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని.. ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం నాడు పార్టీ పొలిట్ బ్యూరో భేటీ అయింది. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో.. బరిలో దిగేందుకు టీడీపీ ముందుకు రావడం లేదు. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడంలేదని టీడీపీ నాయకత్వం వెల్లడించింది. టీడీపీ తొలుత తన అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. రాజశేఖర్ గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ భావించింది. గత ఆనవాయితీలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ తాజాగా బరి నుంచి తప్పుకుంది. ఇప్పటికే జనసేన పార్టీ బద్వేల్ లో తమ అభ్యర్థిని బరిలో దింపడంలేదని ప్రకటించడం తెలిసిందే. దీంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బద్వేలు నుంచి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అధిష్ఠానం నుంచి వచ్చే అదేశానుసారం ముందుకెళ్తామని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించామని, అయితే పవన్ అందుకు సుముఖత చూపలేదని అన్నారు. దీంతో తమ పార్టీ నుంచే అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు చెప్పారు. పార్టీలోని ఆశావహుల పేర్లతో అధిష్ఠానానికి జాబితా పంపించినట్టు చెప్పారు. తాము కనుక పోటీలో నిలిస్తే జనసేన మద్దతు కోరతామని వీర్రాజు అన్నారు. కడపలో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 12 =

Back to top button