బద్వేల్ ఉప ఎన్నికపై కీలక ప్రకటన చేసిన బీజేపీ

0
945

కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ కూడా సమాయత్తమవుతోంది. బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థి పుంతల సురేష్ పేరును ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. గురువారం నాడు పుంతల సురేష్ ను అధికారికంగా ప్రకటించింది. బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్న పుంతల సురేష్ బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. పనతల సురేశ్ తొలి నుంచీ సంఘ్ సంబంధిత సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా మొదలై, బీజేపీవైఎంకు జాతీయ స్థాయిలోనూ నాయకత్వం వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పనతల సురేశ్ ఇదే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు.

బద్వేల్ ఉప ఎన్నిక.. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకుని కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. మళ్లీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని తెలుగు దేశం పార్టీ తెలిపింది. బద్వేల్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని.. ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు అధ్యక్షతన కొద్దిరోజుల కిందటే పార్టీ పొలిట్ బ్యూరో భేటీ అయింది. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో.. బరిలో దిగేందుకు టీడీపీ ముందుకు రావడం లేదు. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడంలేదని టీడీపీ నాయకత్వం వెల్లడించింది. గత ఆనవాయితీలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ తాజాగా బరి నుంచి తప్పుకుంది. జనసేన పార్టీ బద్వేల్ లో తమ అభ్యర్థిని బరిలో దింపడంలేదని ప్రకటించింది.

బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసన సభ్యురాలు పీ ఎమ్‌ కమలమ్మని నియమిస్తున్నట్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ కమిటీ అధ్యక్షులు సాకే శైలజనాథ్‌ ప్రకటనను విడుదల చేశారు.