More

    ఆజంఖాన్ ఇక ఎమ్మెల్యే కూడా కాదు.. శాసనసభ సభ్యత్వం రద్దు

    సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, రాంపూర్‌ ఎమ్మెల్యే ఆజంఖాన్‌ శాసనసభ సభ్యత్వం రద్దయింది. ఆజం ఖాన్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని ఉత్తరప్రదేశ్ స్పీకర్ ప్రకటించారు, రాంపూర్ స్థానం నుండి ఎమ్మెల్యేగా అతనిపై అనర్హత వేటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా 2019లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో గురువారం ఆయనపై అనర్హత వేటు పడిందని విధానసభ వర్గాలు తెలిపాయి.

    2019 విద్వేష ప్రసంగం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆజంఖాన్‌ శాసనసభ సభ్యత్వం రద్దయినట్టు, రాంపూర్‌ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ఈ మేరకు యూపీ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రదీప్‌ దూబే శుక్రవారం వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో ఓ ఐఏఎస్‌ అధికారితోపాటు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆజంఖాన్‌పై కేసు నమోదైంది. చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజంఖాన్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఈ ఏడాది మొదట్లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో గడిపారు. 2013 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపీ క్రిమినల్ కేసులో దోషిగా తేలి కనీసం రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే, అతను/ఆమె తక్షణమే సభ్యత్వాన్ని కోల్పోతారు.

    Trending Stories

    Related Stories