దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ జన్మ భూమిలో… రామాలయ నిర్మాణానికి సంబంధించి.. పునాది రాయి పడింది.
రామాలయ నిర్మాణానికి సంబంధించి.. రామజన్మభూమి త్రీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం తేది 2021 మార్చి 14న దివ్య ముహూర్తం నందు వేద పూజతో పునాది నిర్మాణం చేసింది.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్, ట్రస్టీలు పాల్గొన్నారు. నిజానికి 2.77 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణానికి అధికారిక తేదీ ఏప్రిల్ 9గా నిర్ణయించారు. ఆ రోజే ఆలయం, గర్భాలయ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఐతే… సోమవారం 40 అడుగుల పునాదిలో 1 అడుగు కాంక్రీట్ వేయడం ద్వారా… తొలి పని ప్రారంభించినట్లు అయ్యింది.
ఈ సందర్భంగా “ఈ రోజు చాలా బాగుంది. మంచి రోజు. ఉదయం సమయంలో వేద పూజ జరిగింది. తద్వారా రామాలయ నిర్మాణానికి పునాది వేసే కార్యక్రమం ప్రారంభమైంది.” అని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా తెలిపింది.
ట్రస్ట్ నిర్వాహకులు అందించిన వివరాల ప్రకారం… పునాది నిర్మాణం… ఆగస్ట్ నాటికి పూర్తవుతుంది. అప్పుడు అసలైన ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది.
చంపత్ రాయ్ మాట్లాడుతూ “మేము అంతా షెడ్యూల్ ప్రకారం చేసేలా సిద్ధమవుతున్నాం. అంతా అనుకున్నట్లే జరిగితే… శ్రీరామచంద్రస్వామి ఆలయం 2023 నాటికి పూర్తవుతుంది” అని తెలిపారు.
మూడు అంతస్థుల రామ మందిరం నిర్మాణం… అయోధ్య నగర నిర్మాణంలో భాగంగా ఉంది. అంటే… రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడే… అయోధ్య నగర ఆధునీకరణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
మొత్తం 875 చదరపు కిలోమీటర్ల నగర అభివృద్ధి కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం… ఢిల్లీకి చెందిన సీపీ కుక్రేజా ఆర్కిటెక్స్ సంస్థకు పనులు అప్పగించింది. అలాగే… నిర్మాణాల కోసం లార్సెన్ అండ్ టూబ్రోకి పనులు అప్పగించిన విషయం తెలిసిందే.