పారా ఒలింపిక్స్ లో భారత్ కు గోల్డ్.. సరికొత్త చరిత్ర..!

0
675

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అవని లేఖర 249.6 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా డిసెంబరు 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఇరీనా షెట్నిక్ నమోదు చేసిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా అవని రికార్డులకెక్కింది.

టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భవీనా పటేల్ రజతం గెలిచింది. మహిళల సింగిల్స్ క్లాస్ 4‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి ఝౌ యింగ్‌తో జరిగిన పోరులో భవీనాబెన్ పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులెక్కింది. భవీనా పటేల్ మీడియాతో మాట్లాడుతూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు స్ఫూర్తి అని తెలిపింది . సచిన్ సుదీర్ఘ కెరీర్ లో అనేక ఘనతలతో తాను ప్రేరణ పొందానని, ఆయనకు తాను సాధించిన పతకం చూపిస్తానని తెలిపింది. సచిన్ ఉత్తేజభరితమైన ప్రసంగాలు వినాలని ఉందని, ఆయన మాటలతో తనకు మరింత ఆత్మవిశ్వాసం లభిస్తుందని భవీనా పటేల్ తెలిపింది.

హైజంప్ క్రీడాంశంలో నిషాద్ కుమార్ రజతం సాధించాడు. 2.06 మీటర్ల జంప్ తో నిషాద్ ఫైనల్ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచాడు. తన ప్రదర్శనతో నిషాద్ ఆసియా రికార్డు నెలకొల్పడం విశేషం. హైజంప్ లో అమెరికాకు చెందిన రోడెరిక్ టౌన్సెండ్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అమెరికాకే చెందిన డల్లాస్ వైజ్ కాంస్యం దక్కించుకున్నాడు. పసిడి విజేత టౌన్సెండ్ 2.15 మీటర్ల జంప్ తో అగ్రస్థానంలో నిలిచాడు. డిస్కస్ త్రో క్రీడాంశంలో వినోద్ కుమార్ కాంస్యం సాధించాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here