చైనాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా

0
917

చైనా దేశ నాయకుల తీరును ప్రపంచం మొత్తం తప్పుబడుతూ ఉంది. అన్ని విషయాలలోనూ చైనా ప్రభుత్వ తీరును విమర్శిస్తూనే ఉన్నారు. దౌత్య పరమైన విభేదాలతో చైనా ఎన్నో దేశాలకు దూరమవుతూ వస్తోంది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బాయ్‌కాట్‌ చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా సైతం అదే దారిలో నడిచింది. దౌత్యపరంగా ఒలింపిక్స్‌ గేమ్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ బుధవారం తెలిపారు. చైనాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత గేమ్స్‌ను బహిష్కరించడంలో ఆశ్చర్యం లేదని, నిర్ణయం సరైందేనన్నారు. దౌత్యపరంగా గేమ్స్‌ను బాయ్‌కాట్‌ చేసినా.. అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారన్నారు.

చైనాలో మానవహక్కుల ఉల్లంఘన తీవ్రంగా ఉందని కూడా అన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కొనుగోలు చేయాలన్నది ఆస్ట్రేలియా నిర్ణయానికి సంబంధించింది. ఈ ప్రాంతంలో బలమైన రక్షణ దళాన్ని కలిగి ఉండేందుకు ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాలను చైనా విమర్శించడాన్ని తప్పుబట్టారు స్కాట్‌ మోరిసన్‌. తమతో ఉన్న విభేదాలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని, అందుకు చైనా ముందుకు రావడం లేదని తెలిపింది. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడాన్ని చైనా తప్పుబడుతోంది. ఫిబ్రవరిలో జరిగే వింటర్‌ క్రీడలకు 40 కంటే ఎక్కువ మందిని అథ్లెట్లను గేమ్స్‌కు పంపాలని ఆస్ట్రేలియన్‌ ఒలిపింక్‌ కమిటీ భావిస్తోంది. అయితే మోరిసన్‌ ప్రకటన దీనిపై ప్రభావం చూపబోదని ఆస్ట్రేలియన్‌ ఒలిపింక్‌ కమిటీ తెలిపింది.

టెన్నిస్ స్టార్ అదృశ్యంపై క్రీడా లోకం తీవ్ర విమర్శలు:

చైనీస్ స్టార్ విమెన్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షుయ్ అదృశ్యం గురించి కూడా ఇటీవల తీవ్రమైన చర్చ జరిగింది. ఆమె అదృశ్యం కావడానికి ముందు ఆమె చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై సంచలన ఆరోపణలు చేశారు. అతడు తనను బెదిరించి.. లైంగికంగా దాడి చేశాడని.. అత్యాచారం కూడా చేశాడని ఆమె ఆరోపించారు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్‌ షువాయి నవంబర్‌ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్‌ చేసింది. అయితే ఆమె ఏరోజైతే పోస్ట్‌ డిలీట్‌ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది. పెంగ్ షుయ్‌ని చైనా ప్రభుత్వమే ఏదో చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్‌తో పెంగ్ షుయ్ అరగంట పాటు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. తనకు ఏమీ కాలేదని పెంగ్ షుయ్ చెప్పుకొచ్చింది. కానీ పెంగ్ షుయ్ వీడియో కాల్ లో మాట్లాడినా.. ప్రపంచం మాత్రం చైనాను నమ్మడం లేదు.

పెంగ్‌ షుయ్ ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(WTA) చైనాకు అల్టిమేటం జారీ చేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ చైనాకు షాక్‌ ఇచ్చింది. చైనాలో టోర్నీలను నిలిపివేయడం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారని WTA చైర్మన్, CEO స్టీవ్ సైమన్ అన్నారు.