ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. వైట్ బాల్ క్రికెట్ లో ఎప్పుడూ డామినేషన్ కనబరిచే ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టుకు రూ.11.89 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన కివీస్ జట్టుకు రూ.5.9 కోట్లు దక్కాయి.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. విలియమ్సన్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 28, గ్లెన్ ఫిలిప్స్ 18, జేమ్స్ నీషామ్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 3, జంపా 1 వికెట్ తీశారు. స్టార్క్ 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు.
ఇక ఛేజింగ్ లో ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను న్యూజిలాండ్ బౌలింగ్ ఏ దశ లోనూ ఇబ్బంది పెట్టలేకపోయింది. మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. వార్నర్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు సాధించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్ ) మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు రెండు వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. తాజాగా టీ20 ఫార్మాట్లో తొలిసారిగా విజేతగా నిలిచింది. 2019లో వన్డే వరల్డ్ కప్ లో ఓడిన న్యూజిలాండ్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ ఓటమి పాలైంది.