క్రికెట్ టీమ్ ను పంపించడానికి సిద్ధమైన తాలిబాన్లు.. షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

0
720

తాలిబాన్లు పురుషుల క్రికెట్ టీమ్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే..! ఆస్ట్రేలియాలో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును కూడా పంపాలని భావించారు. అధికారం చేపట్టిన తర్వాత దేశంలో తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆడటానికి తాలిబాన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హమీద్ షిన్వారీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడటానికి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. ఈ మ్యాచ్ నవంబర్ 27 మరియు డిసెంబర్ 2 మధ్య హోబర్ట్‌లో నిర్వహించాలని భావించారు. ఈ మ్యాచ్ 2020 లోనే నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది.

గత మూడు దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్ ప్రజాదరణ పొందింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కారణంగా క్రికెట్ ప్రజాదరణను పెంచింది. రషీద్ ఖాన్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ఇతర క్రికెట్ ఆడే దేశాలలో లీగ్ మ్యాచ్ లు ఆడుతూ.. పాపులారిటీని సంపాదించాడు. 2017 లో ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా లభించింది.. జూన్ 2018 లో బెంగళూరులో భారత్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఏడాది జరగనున్న ఐసిసి టి 20 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పలు జట్లతో తలపడనుంది.

ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడటానికి తాలిబాన్లు ఓ వైపు క్రికెట్ జట్టుకు అనుమతులు ఇవ్వగా.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ నిరవధికంగా వాయిదా వేయబడుతుందని, రాబోయే రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని క్రికెట్ టాస్మానియా సీఈఓ డొమినిక్ బేకర్ చెప్పారు. అవసరమైతే యాషెస్ టెస్ట్ నిర్వహించడానికి టాస్మానియా సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, క్రికెట్ ఆస్ట్రేలియా తాలిబాన్ ప్రభుత్వం మహిళలు క్రీడలు ఆడటానికి అనుమతించకపోతే నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు హోబర్ట్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేస్తామని చెప్పింది. వారు మహిళలను అనుమతించకపోవడం ఆమోదయోగ్యం కాదు. మహిళా క్రికెట్ గురించి ఏమి చేస్తారో పునరాలోచించుకోవాలని బేకర్ తెలిపారు.