టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ నేడు ఆస్ట్రేలియాతో సెమీస్ లో తలపడనుంది. ఇప్పటి దాకా టోర్నీలో ఒక్క ఓటమి కూడా ఎదురవ్వని పాకిస్థాన్ కు సెమీస్ లో గట్టి పోటీ ఎదురవ్వనుండగా.. ఇంతలో ఊహించని షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు అనారోగ్యం పాలయ్యారు. షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ ఫ్లూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముందు రోజు ప్రాక్టీస్ కు దూరమయ్యారు. కరోనా ఏమోననే భయాలతో వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ అని వచ్చింది. ఇక ఇద్దరికీ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈరోజు మరోసారి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. వైద్యులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా వారు మ్యాచ్ ఆడేది నిర్ణయించబడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మ్యాచ్ కు మాలిక్, రిజ్వాన్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండొచ్చని.. ఇదే జరిగితే పాకిస్థాన్ కు పెద్ద సమస్యే అని చెప్పుకోవాలి. ఓపెనర్ గా రిజ్వాన్ ఐదు మ్యాచ్ లలో 214 పరుగులు చేశాడు. షోయబ్ మాలిక్ మిడిలార్డర్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. వీరిద్దరూ సెమీస్ కు దూరమైతే వారి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బుధవారం ఉదయం రిజ్వాన్, షోయబ్ మాలిక్ లకు తేలికపాటి ఫ్లూ, తక్కువ జ్వరం వచ్చిందని అధికారి తెలిపారు. శిక్షణను కాస్త ఆలస్యంగా మొదలు పెట్టాలని సలహా ఇచ్చారు. ఆ తర్వాత శిక్షణకే రావద్దని అధికారులు సూచించారు. రిజ్వాన్ మరియు మాలిక్ పాకిస్తాన్ విజయాల్లో కీలక ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ మ్యాచ్ కు దూరమైతే మాత్రం పాక్ కు గట్టి ఎదురుదెబ్బ. టోర్నమెంట్‌లో ఉన్న బ్యాటర్లలో రిజ్వాన్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ లో మూడో స్థానంలో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
మాలిక్ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఛేజింగ్‌లలో ముఖ్యమైన సహకారంతో పాటూ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్‌ను మరింత బలంగా ఉంచాడు. స్కాట్‌లాండ్ మీద పాకిస్థాన్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీని కొట్టాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్‌లో స్ట్రైక్ రేట్ 187ని కలిగి ఉన్నాడు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రిజ్వాన్ స్థానంలో రావచ్చని చెబుతున్నారు. హైదర్ అలీ మాలిక్ స్థానంలో జట్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. బాబర్‌తో పాటు ఓపెనింగ్ చేయడానికి ఫఖర్ జమాన్ రావచ్చని భావిస్తున్నారు. మ్యాచ్ మొదలయ్యే సమయం వరకూ ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాలి.