ఆగష్టు 14న పాకిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన సంగతి తెలిసిందే..! 1947 ఆగస్ట్ 14న అఖండ భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. వారు మన కంటే ఒక్కరోజు ముందుగానే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. పాకిస్తాన్ కు స్వాతంత్య్రం రాగానే పెద్ద ఎత్తున పాక్ లో హిందువులపై ఊచకోత కొనసాగింది. పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇది చరిత్రలోని చీకటి అధ్యాయం.
ఈ నేపథ్యంలోనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయానకాల స్మారక దినం’గా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ట్విట్టర్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ విభజన నాటి గాయాలను ఎప్పటికీ మరువలేమని.. కొన్ని లక్షల మంది మన సోదరులు, సోదరీమణులు దేశ విభజన వల్ల నిరాశ్రయులయ్యారు. ద్వేషం, హింస వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి మనవారి త్యాగాలు, కష్టాలను గుర్తు చేసుకునేందుకు.. ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయానకాల స్మారక దినం’గా ప్రకటిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. ఇకపై దీనితోనైనా సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోతాయని ఆశిద్దామన్నారు. ఐకమత్యమే మహాబలం అన్న నానుడిని, సామాజిక సామారస్యాన్ని, మానవాళి అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా విభజన భయానకాల స్మారక దినం పాటిద్దామంటూ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు:
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ మాట్లాడుతూ, రేపు మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా వారికి స్వీట్లు బహుమతిగా ఇస్తామని చెప్పారు.