నాన్సీ ఎక్కడ? అంటూ కేకలు.. చివరికి భర్తపై దాడి

0
880

అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేరు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు నాన్సీ భర్త పాల్ పెలోసీపై దాడి చేశాడు. ఈ దాడిలో 82 ఏళ్ల పాల్ పెలోసీ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్ పెలోసీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఓ క్యాపిటల్ వెంచర్ సంస్థ నిర్వహిస్తున్నారు. ఆయనపై దాడికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. దుండగుడు ఓ సుత్తితో దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇంట్లోకి చొరబడిన అనంతరం అతడు నాన్సీ పెలోసీ కోసం వెదికినట్టు తెలుస్తోంది. నాన్సీ ఎక్కడ? నాన్సీ ఎక్కడ? అంటూ కేకలు వేసినట్టు తెలుస్తోంది.

శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2:30 గంటలకు (0930 GMT) దంపతుల ఇంటి వద్ద దుండగుడిని అధికారులు కనుగొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు చీఫ్ బిల్ స్కాట్ విలేకరులతో మాట్లాడుతూ దాడి చేసిన దుండగుడిని 42 ఏళ్ల డేవిడ్ డెపాప్ అని తెలిపాడు.