More

    వ్యాక్సిన్లు వేయడానికి వచ్చిన వారిపై దాడులు

    కరోనా వ్యాక్సిన్లు వేయడానికి వెళుతున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉజ్జయిని జిల్లాలోని మలిఖేడి గ్రామంలో వ్యాక్సిన్లు వేయడానికి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసి గాయపరిచారు. సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఇంకో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కొందరు బూతులు తిడుతూ దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. హెల్త్ కేర్ వర్కర్లు పారిపోవడాన్ని వీడియోలో గమనించవచ్చు. మెడికల్ టీమ్ లోని ఇద్దరు గాయపడ్డారు. అలాగే అడిషనల్ తహసీల్దారుకు కూడా గాయాలు అయ్యాయి.

    అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆకాష్ భూరియా మాట్లాడుతూ మెడికల్ టీమ్ ఇంతకు ముందు కూడా ఆ గ్రామానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే ఉపయోగాల గురించి తెలియజేశారట.. అయినా కూడా అందుకు వాళ్ళు ఒప్పుకోకుండా వెళ్లిపోవాలని కోరారు. సోమవారం నాడు మరోసారి కూడా మెడికల్ టీమ్ వెళ్లడంతో కోప్పడిన గ్రామస్థులు వారిపై దాడి చేశారని తెలిపారు. వ్యాక్సిన్లు, ఇంజంక్షన్లు వంటి వాటిపై ఎన్నో కట్టు కథలు ప్రచారంలో ఉండడంతో స్థానికులు వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్లు వేసుకోవాలని అధికారులు చెప్పినా కూడా వినడం లేదు. వ్యాక్సిన్లు వేసుకుంటే చచ్చిపోతారు అనే తప్పుడు ప్రచారాన్ని గ్రామాల్లో ఎక్కువగా నమ్మేస్తూ ఉండడంతో వ్యాక్సిన్లు అంటేనే భయపడుతూ ఉన్నారు. ఈ ఘటనల్లో అరెస్టులు జరుపుతూ ఉన్నామని.. పోలీసు ఫోర్స్ ను రంగంలోకి దింపామని ఆకాష్ భూరియా తెలిపారు.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరాబంకి గ్రామానికి చెందిన గ్రామస్థులు ఆరోగ్య అధికారులను చూసి నదిలోకి దూకేశారు. అధికారులు వ్యాక్సిన్లు వేయడానికి వస్తున్నారని తెలిసి సరయూ నదిలోకి దూకి పారిపోయారు కొందరు. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుందని తెలిపారు. వ్యాక్సిన్ల వలన ప్రయోజనాలు, ఏమీ అవ్వదు అంటూ హామీ ఇచ్చినా కూడా గ్రామస్థులు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రాలేదు. కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వచ్చారు. చాలా వదంతులు గ్రామంలో ప్రచారంలో ఉండడంతో వారంతా భయపడ్డారని.. అందుకే వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి కట్టడికి వైద్య సిబ్బంది ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయినా కూడా కొందరు ఫ్రంట్ లైన్ వర్కర్లు, డాక్టర్లు, మెడికల్ బృందాలు, నర్సుల మీద దాడులు జరుపుతూనే ఉన్నారు. గత ఏడాది కూడా ఎంతో మందిపై దాడులు జరిగిన ఘటనలు చూసాము. తబ్లిగే జమాత్ కు చెందిన మెంబర్లు ఉత్తర ప్రదేశ్ లో నర్సులను లైంగికంగా ఏడిపించడం, ఢిల్లీలో హెల్త్ కేర్ వర్కర్లపై ఉమ్మివేయడం వంటివి జరిపిన సంగతి తెలిసిందే..! ఢిల్లీ నిజాముద్దీన్ లో చోటు చేసుకున్న జమాత్ కారణంగా కరోనా విపరీతంగా పెరిగిపోయింది. హెల్త్ కేర్ వర్కర్లపై దాడులు జరిపిన ఘటనలు మధ్యప్రదేశ్ లోని ఇండోర్, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రాంతాల్లో కూడా చోటు చేసుకున్నాయి. హెల్త్ కేర్ వర్కర్లపై దాడులను అరికట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ను కూడా తీసుకుని వచ్చింది. ఆరు నెలల నుండి 7 సంవత్సరాల వరకూ కఠిన శిక్ష విధించనున్నారు.

    Related Stories