మహానాడును ఎవరూ ఆపలేరంటున్న అచ్చెన్న

0
718

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒంగోలులోనే ఉంటూ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అన్నారు. తమ మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందని.. మహానాడును విఫలం చేయాలని ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తల సమష్టి కృషితో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. అందరూ సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేశామంటున్నారని.. 2014లో టీడీపీకి 103 స్థానాలు వస్తే 9 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని అన్నారు. జగన్ 151 స్థానాలు గెలిచి 10 మందికే మంత్రి పదవులు ఇచ్చారని.. ఆ లెక్కన చూస్తే ఏ పార్టీ సామాజిక న్యాయం పాటించినట్లని ప్రశ్నించారు.