More

  మా భూభాగంలో మీ ప్రాజెక్టులేంటి..? చైనాకు జైశంకర్ దిమ్మతిరిగే వార్నింగ్..!

  ‘As for the imperialist countries, we should unite with their peoples and strive to coexist peacefully with those countries do business with them and prevent any possible war’ సామ్రాజ్యవాదం అంటే ఇతర దేశాలతో శాంతియుత సంబంధాలు నెరపడమే కాకుండా ఆయా దేశాల ప్రజలతో మమేకమవ్వాలి. ఒకవేళ ఇరుదేశాల మధ్య యుద్దం చేసే పరిస్థితులే వస్తే సాధ్యమైనంత వరకు యద్దాన్ని ఆపడానికే ప్రయత్నించాలని అంటారు.. చైనా మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్. అయితే మావో జెడాంగ్ నీతి సూక్తులు చైనా అధ్యక్షుడు జిన్‎పింగ్‎కు వంటబట్టలేనట్లున్నాయి. అందుకే ఇతర దేశాలతో సత్సంబంధాలు నెరిపే క్రమంలో సొంత గురువు సిద్దంతాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. స్వప్రయోజనాల కోసం ఇతర దేశాలు ఏమైపోయినా తనకు సంబంధమే లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. చిన్న చిన్న దేశాలను ఆర్థిక ఊబిలోకి లాగి తన గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు జిన్‎పింగ్. చైనా చెప్పుచేతల్లో బంధీలైన పాక్, శ్రీలంక లాంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుని.. భారత్ లాంటి బాధ్యతాయుత దేశానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడు. బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్, చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ లాంటివాటిని నిర్మించి భారత్ ను తరచూ ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాడు జిన్‎పింగ్.

  అయితే పక్కదేశాలు ఏది చేసినా చూస్తూ ఉండిపోవడానికి ఇది ఒకప్పటి భారత్ కాదు. దేశాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రతిదాన్ని ఆయా దేశాల ఎదుటే ఎండగడుతోంది భారత్. తాజాగా చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ ను కూడా భారత్ వ్యతిరేకిస్తూ చైనా వైఖరిని ఎండగట్టింది. షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ లో భారత్ తన వైఖరిని కుండబద్ధలుకొట్టింది. చైనా ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుందని బహిరంగంగానే విమర్శించారు విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్. ఇటీవల జరిగిన 21వ ప్రభుత్వాధికారుల వర్చువల్ మీటింగ్ లో మాట్లాడిన జైశంకర్ చైనా బీఆర్ఐ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్‎సీఓ సభ్యదేశాలన్నీ పరస్పరం ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించుకోవాలన్నారు. ఇరుదేశాల మధ్య కనెక్టివిటీ ప్రాజెక్టులు నిర్మించుకున్నా అది పక్క దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేదిగా ఉండకూడదని హెచ్చరించారు. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ ను ఎస్‎సీఓ సభ్యదేశాలన్నీ అంగీకరిస్తున్న సమయంలోనే జైశంకర్ దీన్ని వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి, చైనా విస్తరణవాదంలో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని పీఓకే ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీంతో పాటు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ను కూడా పాక్ ఆక్రమిత భూభాగంలోనే నిర్మిస్తుంది. అంతర్జాతీయ మ్యాపుల ప్రకారం కూడా ముమ్మాటికీ అది భారత్ భూభాగమే. కాబట్టి దీనికి భారత్ అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారని.. ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసినట్లేనని జైశంకర్ స్పష్టం చేశారు.

  అయితే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా అన్ని దేశాలూ అంగీకరించేలా ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా జైశంకర్ సూచించారు. బీఆర్ఐ ప్రాజెక్టు కంటే ఇప్పటికే ఉన్న ‘ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‎పోర్ట్ కారిడార్’ తో పాటు ఇరాన్ లోని చాబహార్ పోర్టు ద్వారా మరింత ఎక్కువగా వాణిజ్యం జరపాలని సూచించారు. వీటి ద్వారా వాణిజ్యం జరపడం మరింత సులభమవుతుందని తెలిపారు. ఈ రెండు కారిడార్లను అనుసంధానిస్తూ చాబహార్ పోర్టు దగ్గర ‘షాహీద్ బెహెస్తీ’ టెర్మినల్ ను అన్ని దేశాలూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ టెర్మినల్ ఒకేసారి రెండు కారిడార్లను కలపి వాణిజ్యాన్ని మరింత సులభతరం చేస్తోందని జైశంకర్ అన్నారు. ఒకవేళ బీఆర్ఐ ప్రాజెక్టును చైనా పూర్తి చేసినా కూడా ప్రపంచదేశాలు ఈ ప్రాజెక్టు నుంచి వాణిజ్యం జరపడం అంత సులభం కాదని జైశంకర్ అన్నారు. ఇక్కడి నుంచి వాణిజ్యం జరపడానికి పాకిస్తాన్ పదే పదే అడ్డు పడుతుందన్నారు. గతంలో నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని ఎస్‎సీఓ సమావేశంలో చెప్పారు. సెంట్రల్ ఏషియా వాణిజ్యానికి పాకిస్తాన్ పదే పదే అడ్డుపడుతూ పూర్తి వాణిజ్య అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు.

  అయితే బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ అనేది చైనా తన వాణిజ్య అవసరాలకోసం నిర్మిస్తోంది. ఈ రోడ్డు ద్వారా నార్తర్న్ దేశాలతో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ చైనా లోని కస్గర్ నుంచి పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు వరకు నిర్మాణమవుతోంది. అయితే ఈ రోడ్డు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతుండటంతో భారత్ అభ్యంతరం తెలుపుతోంది. ఇది భారతదేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించినట్లవుతుందని భారత్ అంటోంది. ఈ బీఆర్ఐ ప్రాజెక్టులతో చైనా పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలను తన అప్పుల ఊబిలోకి లాగడానికి కూడా ప్రయత్నిస్తోంది. చైనా తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షలో భాగంగా ఆయా దేశాల్లో అవసరం లేకపోయినా కూడా ఇటువంటి ప్రాజెక్టులను చేపడుతుంది. పాకిస్తాన్ లో బీఆర్ఐ తో పాటు సీపీఈసీ ప్రాజెక్టులను చేపట్టింది చైనా. అయితే ఈ ప్రాజెక్టులను రెండు దేశాలూ ఉమ్మడిగా నిర్మిస్తున్నాయి. ఇందులో చైనా నిధులను విరివిగా ఖర్చు చేస్తున్నా,.. పాకిస్తాన్ ఆర్థిక స్థితి బాగోలేనందున ఉగ్రదేశం అంతగా ఖర్చు చేయలేకపోతోంది. దీన్నే సాకుగా చూపించి చైనా ఈ ప్రాజెక్టులను మరింత సమయాభావం అయ్యేలా చేస్తోంది. దీంతో పాకిస్తాన్ ఇప్పటికే ఖర్చు చేసిన దానిపై చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులు ఇప్పటికే కొంతభాగం పూర్తయినా కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ సాహసించడంలేదు. పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి ఆర్థిక స్థితి, రాజకీయ కారణాలతో ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో ఈ ప్రాజెక్టులన్నీ ‘వైట్ ఎలిఫెంట్’ ప్రాజెక్టులుగా మారే ప్రమాదం ఏర్పడింది. అంటే ప్రాజెక్టు పూర్తయినా కూడా దానినుంచి ఎటువంటి లాభం రాకపోవడంతో పాటు దానిపై తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా పెరిగిపోతాయి. దీంతో ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా సంభవిస్తాయి. అయితే ఈ ప్రాజెక్టుల్లో వచ్చే నష్టాన్ని చైనా ఏమాత్రం భరించదు. అందులో వచ్చే నష్టాన్ని ఆయా దేశాలే భరించి తమకు అప్పులు కట్టాని ఒత్తిడి తెస్తాయి. దీన్నే ‘డెట్ ట్రాప్’ అని అంటారు. ఇక ఈ ఒత్తిడికి అటు అప్పులు కట్టలేని దేశాలు గత్యంతరం లేక తమ దేశంలోని వ్యూహాత్మక పోర్టులు కానీ, వ్యూహాత్మక ప్రదేశాలను కానీ చైనా తన పేరుమీద రాయించుకుంటుంది. ఈ విధంగానే శ్రీలంక చైనా డెట్ ట్రాప్ లో పడటంతో తన దేశంలోని హంబన్ తోట దీవులను చైనాకు 99ఏళ్ళ వరకు లీజుగా రాసివ్వాల్సి వచ్చింది. ఈ హంబన్ తోట దీవుల నుంచే భారత్ పైకి డ్రాగన్ కంట్రీ కన్నేసి ఉంచింది.

  ఇక పాకిస్తాన్ లో నిర్మిస్తున్న బీఆర్ఐ, సీపీఈసీ ప్రాజెక్టులు కూడా ఇదే డెట్ ట్రాప్ లో పడే అవకాశం ఉందని భారత్ ముందే గ్రహించింది. ఒకవేళ ఇదే జరిగితే పీవోకే లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను చైనాకు రాసిచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే భారత్ కు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులను భారత్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఎస్ఈఓ సదస్సు వర్చువల్ సమావేశంలో కూడా చైనా వైఖరిని జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదనే పరోక్ష సంకేతాలను ఇచ్చారు.

  Trending Stories

  Related Stories