More

    అసోంలో ఘర్షణలు..! బంగ్లాదేశ్ ముస్లింలను ఉసిగొల్పుతున్న PFI..!!

    అసోంలోని దరాంగ్‌ జిల్లా ధాల్‌పూర్‌ ప్రాంతంలో సెప్టెంబర్ 23న భూ అక్రమణల తొలగింపు ప్రక్రియ హింసాత్మకంగా మారింది. పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా మరికొంత మంది పోలీసులు గాయపడ్డారు.  ధాల్​పుర్​లోని ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను  స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర యంత్రాంగం నిర్ణయించింది.

    అధికారులు గ్రామస్థులకు ఇదివరకే నోటీసులు అందించినా.. స్థానికులు ఖాళీ చేయకపోవడంతో పోలీసుల సాయంతో గ్రామస్థులను తరలించే ప్రయత్నం చేశారు. జూన్​లో ప్రారంభమైన ఈ ప్రక్రియ విడతల వారీగా సాగుతోంది. తొలగింపు కోసం వచ్చిన అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసనకు దిగారు. పదునైన ఆయుధాలు, రాళ్లతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

    ఇది ఈశాన్య భారతంలోని ఒక ప్రధాన రాష్ట్రమైన అసోంలో జరిగిన ఘటన. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రసార మాధ్యమాల్లో పదేపదే ప్రసారమయ్యాయి. చూసినవారికి ‘అయ్యో..నిరుపేదలపై అమానుష దాడి ఏమిటి’ అని బహుశా అనిపించే ఉంటుంది. పత్రికలు వాటి స్వంత వ్యాఖ్యానాలతో కూడిన వంటకాలను వడ్డించాయి. ఒకే వార్తను దేశంలోని అనేక పత్రికలు రకరకాలుగా ఎలా రాయగలవు? జరిగింది ఒకే ఘటన అయినపుడు, అందులో కాల్పనిక ఘట్టాలను చేర్చడం ఎలా సాధ్యం? వార్తకూ వ్యాఖ్యకు మధ్య రేఖ చెదిరితే.. ఏమవుతుంది? అని తరచూ అనిపిస్తూ ఉంటుంది.

    అసోం భూ ఆక్రమణలూ…వాటి వెనుక కారణాలూ సహా ఆక్రమించుకున్నది ఎవరూ, ప్రభుత్వ వాదన ఏంటి? భూ ఆక్రమణలకు జనాభా నిష్ఫత్తి మార్పు-Demographic change కు ఉన్న లంకే ఏంటి? పీవీ ఆర్థిక సంస్కరణలకు ముందు, తర్వాత కేంద్ర ప్రభుత్వ భూ విధానంలో వచ్చిన మార్పేంటి? పీఎఫ్ఐ లాంటి సంస్థలు నిరుపేదలను ఎందుకు ఉసిగొల్పుతున్నాయి? పత్రికల్లో కనిపించే వార్తల్లో వ్యత్యాసం ఉండటానికి కారణమేంటి?

    భూమి ఉన్న ప్రతిచోటా వివాదం ఉంటుంది. భూమికి పర్యాయపదం ‘వివాదం’. ఎన్ని కఠినమైన, జటిలమైన సమస్యలనైనా పరిష్కరించవచ్చు. కానీ, భూ సమస్యకు ఎన్ని పరిష్కారాలు చూపినా తిరిగి మళ్లీ కొత్త సమస్యతో ప్రత్యక్షమవుతుంది. అందుకు చాలా కారణాలున్నాయి.

    సుదీర్ఘ కాలం దేశం మొఘల్, బ్రిటీష్ వలస పాలనలో ఉండటం, సంస్థానాలుగా విడిపోయి ఉండటం, దేశ విభజన సమయంలో పంపకాల వివాదాలు అలాగే ఉండిపోవడం, బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు అర్థం పర్థం లేని సవరణలు ప్రతిపాదించడం మూలంగా ‘భూమి’ వివాద కేంద్రంగా మారింది. దేశాల సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దులు, గ్రామాల సరిహద్దులూ..ఇలా ప్రతి సమస్య న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది.

    ఈశాన్య రాష్ట్రాల విషయం మరింత ప్రత్యేకం. ‘సెవెన్ సిస్టర్స్’ గా పిలిచే ఏడు ఈశాన్యభారత రాష్ట్రాల్లో గిరిజన తెగలు, ఉప తెగలు, ప్రత్యేక భాషా, సంస్కృతులు, భౌగోళిక ప్రత్యేకతల కారణంగా వచ్చిన పరస్పర వ్యత్యాసాలు.

    వీటన్నింటికీ తోడు వలసపాలన కాలం కన్నా చాలా ముందే క్రైస్తవ మిషనరీలు ఈశాన్యంలోని లోతట్టు అడవుల్లో కార్యకలాపాలు నిర్వహించడం, బంగ్లాదేశ్ విభజన తర్వాత జరిగిన వలసలు ఇవన్నీ.. మొత్తం దక్షిణాసియాలో ఈ ఏడు రాష్ట్రాలను ‘volatile periphery’-అనిశ్చిత మండలంగా మార్చివేశాయి. చైనా, బంగ్లాదేశ్, భుటాన్, నేపాల్, మైన్మార్ ల సరిహద్దులను కూడా పంచుకోవడంతో ఈశాన్య రాష్ట్రాలు భౌగోళిక రాజకీయాల ఆవరణలోకి అనివార్యంగా ప్రవేశించాయి.

    ఈ ఏడాది జూన్ లో అసోం-మిజోరాంల మధ్య సరిహద్దు వివాదం ఘర్షణాత్మక రూపం తీసుకుంది. దేశంలో ఏడు రాష్ట్రాలు అంతర్గత సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ఘర్షణలు తీవ్ర రూపం తీసుకుంటున్నాయి.

    ఇప్పుడెందుకు హఠాత్తుగా భూ స్వాధీన ప్రక్రియ వేగవంతమైంది? చూద్దాం….

    తొంభయ్యో దశకంలో పీ.వీ.నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత భూ విధానంపై మన అజమాయిషీకి పరిమితులు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు జోక్యం సహజంగానే పెరిగాయి. ఆర్థిక సంస్కరణల కన్నా ముందున్న స్వతంత్ర విధానం అసాధ్యంగా మారింది.

    విదేశీ పెట్టుబడులు దేశంలోకి రావాలంటే భూవివాదాలు పరిష్కారం జరగాలనేది ప్రపంచ బ్యాంకు షరతు. ప్రతి ఏటా న్యాయస్థానాల్లో నలుగుతున్న భూవివాదాల గురించి సర్వేలు నిర్వహిస్తాయి ప్రపంచ స్థాయి సంస్థలు. ప్రభుత్వ భూములు వివాదంలో ఉంటే కొత్త ప్రాజెక్టులు రాకకు అడ్డంకి ఏర్పడుతుంది.

    దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ భూమి లెక్కపద్దులు తేల్చాలని ఇటీవలే కేంద్రం ఆదేశించింది. 4.2 బిలియన్ల పెట్టుబడులు, 17 బిలియన్ డాలర్ల బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, 7వందల రహదారి నిర్మాణ ప్రాజెక్టులు రావాల్సి ఉన్న నేపథ్యంలో భూ స్వాధీన ప్రక్రియలో వేగం పెరిగింది.

    హింసాత్మక ఘర్షణలకు కారణం సాధారణ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతా? దేశవ్యతిరేక శక్తుల కుట్రా?

    దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే…పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లోని భూ వివాదాలు అత్యంత జటిలమైనవి. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు వీటిలో ముఖ్యమైనవి. ఈ రెండు ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి వలస వచ్చినవారు ఉండటం మూలంగా భూ ఆక్రమణల విషయంలో ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయి. ఇది సహజం.

    పౌరసత్వ చట్ట సవరణ, ఎన్.ఆర్.సి లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున హింసకు పాల్పడే శక్తులు సరిహద్దు రాష్ట్రాల్లోని భూములను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా జరిగిందే అసోం ఘర్షణల ఘటన.

    దరాంగ్ జిల్లాల్లో ఆక్రమించిన భూమిని ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత పీఎఫ్ఐ సంస్థ పథకం ప్రకారం పేదలకు మాయమాటలు చెప్పింది. ప్రభుత్వాన్ని తాము ఒప్పించి స్వాధీన ప్రక్రియను నిలిపేవేసేలా చూస్తామని బూటకపు హామీ ఇచ్చింది. నిరుపేదల నుంచి 28లక్షల రూపాయలు వసూలు చేసింది.

    అంతేకాదు, సుదూర ప్రాంతాల నుంచి రాత్రికి రాత్రికి నిరుపేదలను తరలించి ప్రభుత్వ భూముల్లో పాకలు వేయించింది. కొన్నాళ్ల తర్వాత వారిని స్థానికులగా రుజువు చేసేందుకు ధృవపత్రాలను సృష్టిస్తోంది. దీంతో స్థానిక జనాభా కన్నా ఇతర ప్రాంతాల జనసంఖ్య పెరిగి డెమోగ్రఫికల్ ఛేంజ్ వస్తోంది.

    దరాంగ్ లాంటి జిల్లాల్లో భూములు ఆక్రమించిన వారికి నిజానికి వారి వారి స్వస్థలాల్లో స్వంత భూములున్నాయని కూడా గుర్తించింది. ఇలా భూ ఆక్రమణలకు పాల్పడినవారిలో ఎక్కువ శాతం బంగ్లాదేశ్ శరణార్థులే ఉన్నారనేది అసోం ప్రభుత్వ వాదన. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి వైశాల్యం గోవా వైశాల్యం కన్నా రెండింతలని ప్రభుత్వం తేల్చింది.

    63లక్షల భిగాల భూమి అంటే-20.83 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అసోంలో ఆక్రమణకు గురైంది. మరోవైపు 90శాతం మంది స్థానికులకు తమ భూమికి సంబంధించిన పట్టాలు, ఇతర పత్రాలేవీ లేవు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి లెక్కలు తేల్చేందుకు అసోం ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మాజీ ఛీఫ్ హరిశంకర్ బ్రహ్మ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది.

    ప్రభుత్వ భూమి సహా 3వేల 172 చ.కి.మీ అటవీ భూమి, ప్రాచీన ఆలయాలకు, వైష్ణవ సత్రాలకు చెందిన భూములను బంగ్లా వలసదారులు ఆక్రమించుకున్నారనీ, ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని స్థానికులకు ఇవ్వాలని హరిశంకర్ బ్రహ్మ నేతృత్వంలోని కమిటీ శర్బానంద్ సోనోవాల్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

    దీంతో ప్రభుత్వం ఉత్తర అసోంలోని దరాంగ్ జిల్లాలోని 77, 420 భిగాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులు ఆదేశించింది. ఇలా స్వాధీనం చేసుకున్న భూమిలో 9.6కోట్లతో  ‘గారుఖుతి ప్రాజెక్ట్’ పేరుతో అభివృద్ధి పథకాన్ని ప్రారంభించి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

    అసోం రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం 2021-22 బడ్జెట్ లో నిధులు సైతం కేటాయించింది. అడవుల పెంపకం, వ్యవసాయ ప్రోత్సాహం కల్పిస్తే స్థానిక అసోం యువతకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తూర్పు బెంగాల్ నుంచి వందల సంఖ్యలో వలస వచ్చిన వారిని నాటి ప్రభుత్వం అనుమతించడమే తాజా స్థితికి కారణం.

    హెచ్.ఆర్.బ్రహ్మ కమిటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తన నివేదికలో పొందుపరిచింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లడంతో పాటు స్థానికుల భూమి హక్కులకు ప్రమాదం ఏర్పడిందని, బంగ్లా ముస్లీం వలసల కారణంగా జనాభా నిష్ఫత్తి క్రమంగా మారిపోతోందని కూడా కమిటీ తేల్చింది. 1937-47 మధ్య అసోంలో అధికారంలో ఉన్న సయ్యద్ మహమ్మద్ సాదుల్లా ప్రభుత్వం చేపట్టిన ‘Grow More Food’ campaign కారణంగా వేల సంఖ్యలో బంగ్లా ముస్లీంలు దిగువ అసోం జిల్లాల్లోకి వలస వచ్చి స్థిరపడిపోయారని ఈ కమిటీ పేర్కొంది.

    ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నేదేమీ కాదు. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు నాటి ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా…దరాంగ్ జిల్లాలోని ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

    బంగ్లదేశ్ ముస్లీంల ఆధీనంలోని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అసోంలోని నిరుపేదల ముస్లీంలకు ఇవ్వాలని స్థానిక ముస్లీం సంస్థలు కోరుతున్నాయి. పుహూరతోలీ, ధోల్ పూర్, కురువా, ఖోలీహోయి, బజ్నాపత్తర్, సిపాఝర్ రెవెన్యూ తహశిళ్లలో బంగ్లా ముస్లీంలు పెద్ద భూములను ఆక్రమించుకున్నారని అసామీ ముస్లీంలు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా చర్యలకు శ్రీకారం చుట్టింది.

    అక్రమంగా దేశంలోకి ప్రవేశించి దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి, పౌరసత్వం లేని వారికి భారత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే హక్కు ఉత్పన్నమే కాదు. దేశంలో ఉండటమే నిషిద్ధం. కాబట్టి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

    సాంకేతిక ఆవిష్కరణల వల్ల వార్తల చేరవేతలో వేగం పెరిగినమాట నిజమే కానీ, వాటిలోని నిజానిజాలు తెలుసుకోవడం కష్టంగామారిన వాస్తవాన్ని సైతం మనం గుర్తించాలి. లాఠీ ఛార్జ్, లేదా కాల్పుల ఘటన జరగ్గానే మొబైల్ లో షూట్ చేసిన వీడియోలు వైరల్ గా మారి ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసులు కాల్పులు జరపడం, మామూలు మనుషులు పరుగులుతీయడం ఇవన్నీ సాధారణ ప్రజలను సహజంగానే ఆందోళనకు గురిచేస్తాయి. అయితే సదరు సంఘటన ఏ సందర్భంలో జరిగింది? ఏ నేపథ్యంలో జరిగింది? ఎందుకు లాఠీ చేశారు? ఇలాంటి వివారాలు అందులో కనిపించవు.

    పత్రికలు తమ యాజమాన్య విధానాల ప్రకారం ఏ వార్తను అయినా ఆవు కథలా రాసేందుకు ప్రయత్నిస్తాయి. వార్తలో వ్యాఖ్యానాన్ని జోడించి విమర్శను అందులో భాగం చేయడాన్ని మనకు తెలియకుండానే మనం అంగీకరిస్తున్నాం. వార్తను వార్తగా అచ్చేసి, వ్యాఖ్యను సంపాదకీయంలో జోడించవచ్చు. ఆ కాలమెప్పుడో పోయింది. అసోం ఘటన అందుకు ప్రబల ఉదాహరణ. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లీంలు పేదవారే కావచ్చు. కాదని ఎవరూ అనలేదు. వారి పరిస్థితి దయనీయంగా కూడా ఉండవచ్చు. నిరాకరించలేం. అయితే ఏ దేశమైన తన రాజ్యాంగ పరిధిని దాటి ఊదారతను ప్రదర్శిస్తుందా?

    ప్రపంచ దేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల విషయంలో ఆయా దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనే ప్రశ్నలు వేసుకుంటే…జవాబులు సులభంగానే దొరుకుతుంది. పైగా అసోం స్థానికులను, ఈశాన్య రాష్ట్రాల్లోని నిరుపేద ముస్లీంలను కాదని బంగ్లా దేశ్ ముస్లీంలకు అప్పనంగా భూమి కట్టబెట్టమనడం ఏ రకంగా న్యాయసమ్మతం?

    రాజ్యాంగం-దానికి ప్రాతినిథ్యం వహించే చట్టసభలు, రూల్ ఆఫ్ లాను నిర్వచించే సర్వోన్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే తీర్పులు శిరోధార్యం తప్ప…మందను వెంటేసుకుని న్యాయం కావాలంటే…ప్రభుత్వాలు తమ చివరి ఆస్త్రాలను ప్రయోగిస్తాయి. అప్పుడు చింతిస్తే…ఫలితం ఉండదు.

    Trending Stories

    Related Stories