More

  అసోం సీఎం టార్గెట్ గా ట్విట్టర్ వార్..!

  ఇటీవల అసోం-మిజోరాం మధ్య చెలరేగిన సరిహద్దు గొడవల్లో ఏడుగురు అసోం పోలీసులు మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆ వెంటనే, అసోం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. #shameonAssam, #resignassamCM వంటి యాష్ ట్యాగ్‎లు ట్విట్టర్‎లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఇక్కడ మీరో విషయం గమనించారా..? అసలు బాధితులు అస్సామీయులైతే.. ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం జరగడమేంటి..? దీనినిబట్టి ఇందులో ఏదో కుట్ర కోణం దాగున్నట్టు అనిపిస్తోంది కదూ..! ఎస్.. మీ అనుమానం నిజమే. ఈ ట్విట్టర్ ప్రచారమంతా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా కావాలని చేస్తున్న కుట్ర..!!

  అసోంపై అవమానం అన్న రేంజిలో సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే.. #shameonAssam యాష్ ట్యాగ్ ఎక్కువగా ఆమెరికా నుంచి ట్రెండ్ అవుతోంది. దీనిని గుర్తించిన ఓ నెటిజన్.. ఈ యాష్ ట్యాగ్ ఎవరు ట్రెండ్ చేస్తున్నారో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ యాష్ ట్యాగ్ ను ఎక్కువగా వాడిన ట్విట్టర్ హ్యాండిల్స్ అమెరికాకు చెందినవే వున్నాయి. ఇందులో భారత్ నుంచి కేవలం వన్ బై థర్డ్ హ్యాండిల్స్ మాత్రమే వున్నాయి. ఈ గణాంకాలు కేవలం 2.6 మిలియన్ రీచ్ కు సంబంధించిన లెక్కలు మాత్రమే.

  ఇక, #resignassamCM యాష్ ట్యాగ్ కూడా అంతే. ఈ యాష్ ట్యాగ్ ఎక్కువగా న్యూఢిల్లీ నుంచి ట్రెండ్ అయినట్టు కనిపిస్తున్నా.. దీని రూట్స్ మాత్రం వివిధ దేశాల్లో వున్నాయి. ఐపీ అడ్రస్‎లు మార్చి.. ట్విట్టర్ యూజర్లను ఏమార్చి తప్పుదోవ పట్టిస్తున్నారు. Voice Of Assam ట్విట్టర్ పేజ్ ఈ మోసాన్ని గణాంకాలతో సహా బయటపెట్టింది. జూలై 30 ఒక్కరోజే 5 వేల బోట్స్‎ను ఉపయోగించి యాష్ ట్యాగ్‎ను ట్రెండ్ చేసినట్టు గుర్తించారు. ఇక్కడ బోట్స్ అంటే ట్విట్టర్‎ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే టూల్స్. అంటే అమెరికాలో వుంటూ.. ఢిల్లీ నుంచి ట్విట్టర్‎లో మెసేజ్‎లు పోస్ట్ చేయవచ్చన్నమాట. వీటిలో చాలావరకు బోట్స్ సస్పెండ్‎ను చేశారు.

  ఈ పరిణామాలను బట్టి చూస్తే.. ఇది అసోంకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని స్పష్టమవుతంది. నిజానికి, హిమంత బిశ్వ శర్మ అసోం సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ కుట్రలు ఎక్కువయ్యాయి. హిమంత బిశ్వ శర్మ అసోంలోనే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. CAA-NRC‎కి వ్యతిరేకంగా విపక్షాలు చేసిన నిరసనలకు ఎదురొడ్డి నిలిచారు. అక్కడి ప్రజల్లో విశేష ప్రజాదరణ చూరగొన్నారు. పైగా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా వున్న మిజోరాం-అసోం సరిహద్దు గొడవలపై దృష్టిసారించారు. దీంతో, ఆయన హయాంలో ఎక్కడ సరిహద్దుల సమస్య పరిష్కారం అవుతుందోనని.. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రత్యర్థులు, తిరుగుబాటుదారులు బయపడుతున్నారు. అందుకే, హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

  ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా వేధిస్తున్న సరిహద్దు సమస్య పరిష్కారమైతే.. తిరుగుబాటు దారుల అక్రమ వ్యాపారాలు నిలిచిపోతాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదుల నిధులకు ఎలాగైతే బ్రేక్ పడిందో.. ఇక్కడ కూడా అదేవిధంగా వేర్పాటువాదులకు చెక్ పడుతుంది. దీనిని తట్టుకోలేని వేర్పాటువాద శక్తులు, వారికి వంతపాడే మిజోరాం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు హిమంత బిశ్వ శర్మపై కుట్రలకు తెరలేపారు.

  ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో భాగమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. సాధ్యమైనంత తొందరగా సరిహద్దుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. అయితే, ఆయన పర్యటన ముగిసిన వెంటనే.. అసోం పోలీసులపై మిజోరాం దాడులకు పాల్పడింది. అటు, అనంత బిశ్వ శర్మ సైతం బోర్డర్ ఇష్యూ పరిష్కారం పట్ల చొరవచూపడం, సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్య ఎక్కడ పరిష్కారమవుతుందోనన్న అక్కసుతో హిమంత బిశ్వ శర్మను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది.

  ముఖ్యంగా అమిత్‎ షా పర్యటన తర్వాత నుంచి వేర్పాటువాద శక్తులు రెచ్చిపోతున్నాయి. విద్వేషం రగిలించేలా మిజో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు జె. లాల్మువాంజులా.. అసోం ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇందుకు అద్దం పడుతోంది. భారత్ కు వ్యతిరేంగా ఆయుధాలు బయటకు తీయడానికి కూడా వెనుకాడమంటూ.. ఆ లేఖల ో పేర్కొన్న లాల్మువాంజులా.. వేర్పాటువాదాన్ని బహిరంగంగా ప్రకటించాడు. తద్వారా అసోం ముఖ్యమంత్రిని హెచ్చరించే ప్రయత్నం చేశాడు.

  దీనిని బట్టి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా ఎంత పెద్దయెత్తున కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, లాల్మువాంజులా బెదిరింపులకు బిశ్వ శర్మ భయపడలేదు సరికదా.. తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘బ్రదర్, మీరు తప్పుడు నెంబర్ డయల్ చేశారు’’ అంటూ కౌంటరిచ్చారు. తద్వారా తనను టార్గెట్ చేస్తున్న జాతి విచ్చిన్నకర శక్తుల గురించి చెప్పకనే చెప్పారు.

  అంతేకాదు, కాల్పుల ఘటనను ప్రేరేపించిన పలు సంఘటనల్లో స్థానికేతర శక్తుల పాత్రను సైతం హిమంత బిశ్వ శర్మ ముందే గుర్తించారు. కొన్నేళ్లుగా మిజోరాం డ్రగ్స్ కారిడార్ గా మారిపోయింది. మమన్మార్ నుంచి మిజోరాం, అసోంలోని బ్యారక్ వ్యాలీ నుంచి పంజాబ్ వరకు డ్రగ్స్ రవాణా జరుగుతోంది. అయితే, డ్రగ్స్ రవాణాను అరికట్టాలంటూ.. ఇటీవల మిజోరాం సీఎం జోరాంతంగాకు సూచించారు హిమంత బిశ్వ శర్మ. అయినా, దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

  ఇక, అసోం పోలీసులపై జరిగిన దాడిపై అనేక అనుమానాలున్నాయి. పైకి పోలీసుల మధ్య కాల్పులు జరిగినట్టుగా చెబుతున్నా.. మిజోరాం వేర్పాటువాద శక్తులు పోలీసుల ముసుగుల్లో కాల్పులకు తెగబడినట్టు తెలుస్తంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన మిజోరాం పౌరులే అసోం పోలీసులపై దాడి చేశారని.. దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా వున్నాయని అసోం బిశ్వ శర్మ స్వయంగా ప్రకటించారు. ఇందులో నాన్ లోకల్స్ కూడా పాల్గొన్నట్టు అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మిజోరాం సీఎం జోరాంతంగాను కోరారు.

  బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో అనుమానిత మాజీ మిజో తిరుగుబాటుదారులు బంకర్లు నిర్మించారనే వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి, అసోం సరిహద్దులో తన దళాలను మోహరించింది. ముందస్తు చర్యగా, అసోం ప్రభుత్వం మిజోరాంకు వెళ్లవద్దని సూచించింది. వ్యక్తగత భద్రతకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో ట్రావెల్ అడ్వయిజరీ కూడా జారీ చేసింది.

  ఆ తర్వాత కాల్పుల ఘటన జరగడం, ఏడుగురు అసోం పోలీసులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తప్పు జరిగింది మిజోరాం వైపునుంచి అయినా.. ఈ ఘటనకు అసోం ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మను పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో విష ప్రచారం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల గొడవకు ఆయనే కారణమనే రీతిలో వక్రభాష్యాలు చెబుతున్నారు.

  నిజానికి, ఈ సరిహద్దు వివాదం బ్రిటిష్ కాలం నుంచే రగులుతోంది. ఈనాటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో దేశ సమగ్రతను వెంటాడుతూనేవుంది. అయినా, గత ప్రభుత్వాలు దీనికి పరిష్కారం కనుక్కోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కానీ, సరిహద్దు సమస్యను కొలిక్కి తేవాలని భావిస్తున్న హిమంత బిశ్వ శర్మపై మాత్రం ఇలా జాతి వ్యతిరేకులు, విదేశీ శక్తులు, తిరుగుబాటుదారులు ముప్పేట దాడికి పాల్పడుతున్నారు.

  Trending Stories

  Related Stories