‘7 సిస్టర్స్’లో డ్రాగన్ కుట్ర..!

0
852

ఈశాన్యంలో మరోసారి సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అసో-మిజోరాం రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతం రక్తమోడింది. అసోంలోని కాచర్-మిజోరాంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య స్థానికులు, భద్రతా సిబ్బందికి మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆరుగురు అసోం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కాచర్ జిల్లా ఎస్పీ తీవ్రంగా గాయపడ్డారంటే ఘర్షణల తీవ్రత అర్థమవుతుంది. ఏడాదిగా రగులుతున్న వివాదం జూలై 26న మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాల్సిన స్థితి ఏర్పడింది.

దేశాల మధ్య భౌగోళిక సరిహద్దు ఘర్షణలుంటాయి. గగనతలంలో అతిక్రమణ గొడవలు, సాగర మార్గాల్లో ప్రాదేశిక జలాల్లో ప్రవేశిస్తే ఎదురయ్యే పర్యవసనాలూ…ఉండటం సహజం. కానీ, ఒకే దేశంలోని రాష్ట్రాల మధ్య భౌగోళిక సరిహద్దు వివాదాలు ఉంటాయా? ఉంటే ఎందుకు ఉంటాయి?

ఏ చారిత్రక కారణాల మూలంగా సరిహద్దులు వివాదంలో ఉండిపోయాయి? ఏ ఏ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలున్నాయి? తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం ఏంటి? రెండు ఈశాన్య రాష్ట్రాలైన అసో-మిజోరాం రాష్ట్రాల మధ్య చంపుకునేంత తీవ్రమైన సరిహద్దు వివాదం ఏనాటిది? పాలనా యంత్రాంగం మధ్య వివాదమా? ప్రజల మధ్య ఉద్రిక్తతతకు కారణమయ్యే సమస్యా? ఏపీ-కర్ణాటకల మధ్య ఉన్న సరిహద్దు వివాదమేంటి? ఈ వివాదంలో సర్వే ఇండియా సూచించిన పరిష్కారమేంటి?

ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక అంశాలను వర్తమాన వివాదాల నేపథ్యంలో వివరించే ప్రయత్నం చేస్తాను.

అసోం-మిజోరాం సరిహద్దు వివాదం గురించి తెలుసుకునే ముందు ఏపీ-కర్ణాటకల మధ్య సరిహద్దు సమస్య గురించి తెలుసుకుందాం. గతంలో బళ్లారి ప్రాంతంలో ఇనుప ఖనిజం తవ్వకాలు కారణంగా సరిహద్దు రాళ్లు చెదిరి పోయాయి. దీంతో ఏపీ-కర్ణాటకల మధ్య ఉన్న అనంతపురం-బళ్లారీ జిల్లాల పరిధిలో సరిహద్దు వివాదం నెలకొంది. రెండు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివాదం పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది.

ఇరు రాష్ట్రాల అధికారుల వద్ద ఉన్న భూ సరిహద్దు రికార్డులు, గ్రామ పటాల ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సమక్షంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఇప్పటివరకు 76 సరిహద్దులను ఏర్పాటు చేశారు. వాటిని డ్రోన్ల సహాయంతో జీపీఎస్​కు అనుసంధానం చేసే పనిని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ప్రారంభించారు. అనంతపురం – బళ్లారి జిల్లాల సరిహద్దులను నిర్ధారించేందుకు సర్వే వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఏపీ-తెలంగాణల మధ్య భౌగోళిక సరిహద్దు వివాదం ఏంటి?

ఈ ఏడాది జనవరిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రేగింది. అది ఇరు రాష్ట్రాల అధికారులు హద్దు రాళ్లు పాతడం.. పీకేయడం దాకా వెళ్లింది. ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం అధికారులు రాళ్లు పాతడం.. నెంబర్లు వేయడం.. మరో రాష్ట్రానికి చెందిన అధికారులు పీకేయడం పరిపాటిగా మారింది. ఇది దాయాదులైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం.

ఆంధ్రప్రదేశ్‌కు సమీప ప్రాంతమైన అశ్వారావుపేట నుంచి అటు పశ్చిమగోదావరికి.. ఇటు తూర్పు గోదావరికి.. మరోవైపు తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు రహదార్లున్నాయి. సూర్యపేట- దేవరపల్లి జాతీయ రహదారి ఇక్కడి నుంచే వెళ్తుంటుంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉన్నప్పటికీ అధికారుల వైఖరి వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి సరిహద్దు తగాదాలు వస్తూనే ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతం మొత్తం అంటే పోలవరం ముంపు ప్రాంతం మినహాయించి తెలంగాణలోకి చేరిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సరిహద్దు అశ్వారావుపేటకు సమీపంలోని జీలుగుమిల్లి వద్ద ఏర్పాటైంది. అక్కడే ‘0’ కి.మీ రాయిని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటై దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఈ ప్రాంతంలో ఇప్పటికీ సరిహద్దుపై వివాదం రగులుతునే ఉంది.

అసోం-మిజోరాంల మధ్య ఘర్షణకు కారణమేంటి?

అసోం, మిజోరం మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మిజోరంలోని ఐజ్వల్, కొలాసిబ్, మామిత్ జిల్లాలతో అస్సాంలోని కచార్, హైలాకండి, కరీంగంజ్ జిల్లాలకు సరిహద్దు ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ సరిహద్దు వివాదం ఉంది.

చొరబడుతున్నారంటూ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గతంలోనూ జరిగింది. అస్సాంకు మిజోరంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయతోనూ సరిహద్దు వివాదాలున్నాయి.

వివాదం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

జూన్ చివరి వారంలో అసోం పోలీసులు ‘ఐతలాంగ్ నార్’ అనే ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ ప్రాంతం మిజోరం భౌగోళిక పరిధిలోకి వస్తుందనేది ఆ రాష్ట్రం వాదన. అసోంకు ఆనుకుని ఉన్న కొలాసిబ్ జిల్లా పరిధిలో ఎనిమిది మంది రైతుల గుడిసెలను గుర్తుతెలియని వ్యక్తులు జూలై 25 అర్ధరాత్రి దగ్ధం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం అసోం పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్న ‘ఐతలాంగ్ నార్’కు అతి సమీపంలో ఉంది.

కొద్ది రోజుల క్రితం మిజోరం రాష్ట్రానికి చెందిన ప్రజలు గుంపుగా అస్సాంలోని 6.5 కి.మీ.ల మేర చొరబడి అక్రమంగా భూమిని ఆక్రమించేకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని ఖాళీ చేయించేందుకు అస్సాం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తతలు చెలరేగాయి. ఖులిచెర్రా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు మోహరించగా.. మిజోరం వైపు కూడా పోలీసులు తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

గతేడాది అక్టోబర్ లో సైతం ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన కరీంగంజ్, మామిత్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల మధ్య వివాదం నెలకొని అదికాస్త ఘర్షణకు దారితీసింది. పరస్పరం జరిగిన దాడుల్లో కొన్ని గుడిసెలు దగ్ధమయ్యాయి. ఇరు పక్షాల వారూ గాయపడ్డారు. కొద్దిరోజులకే కచార్, లైలాపూర్ గ్రామాల మధ్య ఘర్షణ నెలకొంది.

వివాదానికి సంబంధించి చారిత్రక నేపథ్యం ఏంటి?

‘ఈశాన్య ప్రాంతాల పునర్విభజన చట్టం 1971’ ప్రకారం అసోం నుంచి లుషాయి హిల్స్‌ ప్రాంతాన్ని విడదీసి మిజోరం పేరిట కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.1986లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ గ్రూపుతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంతో 20 ఏళ్ల వేర్పాటువాదానికి తెరపడింది.

1987, ఫిబ్రవరి 20న మిజోరమ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య 164 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. బ్రిటిష్‌ పాలనలోని నిర్ణయాలతో మిజో ఆదివాసుల్లో నెలకొన్న అసంతృప్తి- ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసోమ్‌తో సరిహద్దు వివాదంగా రూపాంతరం చెందింది. బ్రిటిష్‌ పాలకులు వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన రెండు నోటిఫికేషన్ల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ఘర్షణలకు దిగుతున్నాయి.

అసోం-మిజోరాంల మధ్య సరిహద్దు వివాద చరిత్ర వలసపాలన కాలం నాటిది.

బెంగాల్‌ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం 1873వ లో నాటి లుషాయి హిల్స్‌, కచార్‌ మైదాన ప్రాంతాల సరిహద్దులను బ్రిటిష్‌ పాలకులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నొటిఫికేషన్ మాత్రం 1875లో వెలువడింది. భౌగోళిక లబ్ధిని దృష్టిలో పెట్టుకొని మిజోరం ఇదే సరైనదిగా వాదిస్తోంది. లుషాయి హిల్స్‌- మణిపూర్‌ మధ్య సరిహద్దులను నిర్ణయిస్తూ 1933లో బ్రిటిష్‌ ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 1933 నొటిఫికేషన్ వెలువడిన సందర్భంలో తమను సంప్రదించలేదంటారు మిజోలు. వివాదం ఈ నొటిఫికేషన్ మూలంగా మొదలైంది.

తన వాదనకు అనుకూలంగా ఉండటంతో అసోం దాన్ని నెత్తికెత్తుకొంది. ఈ మ్యాప్‌ రూపొందించేటప్పుడు సర్వే అధికారులు స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోలేదని మిజోరం నాయకులు వాదిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవులతో నిండి ఉన్నందువల్ల కచ్చితంగా హద్దులను గుర్తించడం కష్టం.

ఇరువైపులా గ్రామీణులు చాలా సందర్భాల్లో సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళి సాగుచేస్తున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. 1994లో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఆ తరవాత నుంచి రెండు వైపులా సరిహద్దుల్లో బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2006తో పాటు 2020లోనూ ఘర్షణలు జరిగాయి.

306వ నెంబర్‌ జాతీయ రహదారి దాదాపు 12 రోజులు మూతపడింది. మిజోరం వైపు సరకుల రవాణాకు ఇదే జీవనాడి. అసోం వైపు నుంచి అక్రమంగా వచ్చిన బంగ్లా జాతీయులే ఈ ఘర్షణలకు కారణమని మిజోరం నాయకులు ఆరోపించారు.

ఘర్షణల నివారణకు ఇరు రాష్ట్రాల పోలీసు క్యాంపుల మధ్య బీఎస్‌ఎఫ్‌, సశస్త్రసీమాబల్‌ బలగాలను మోహరించారు. మేఘాలయలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ సమస్య పరిష్కారానికి అసోం-మిజోరం అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. వివాదానికి పరిష్కారం లభించే వరకు యథాతథా స్థితి కొనసాగించాలని నిర్ణయించారు.  

మిజో వాసులే 100 ఏళ్లుగా సరిహద్దులు దాటి ఆక్రమణలకు పాల్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు చూస్తే అర్థమవుతుందనేది అసోం వాదన.  ఈశాన్య భారత్‌లో అసోం కీలకమైన రవాణా మార్గం. మిజోరం రెండు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటోంది. భారత్‌ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’అమలులో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు బీఆర్‌ఐ ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తోంది చైనా.

కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర పరిధిలోని భౌగోళిక సరిహద్దు వివాదాల పరిష్కారానికి 1967లో మెహర్ చంద్ మహజన్ కమిషన్ ఏర్పాటు చేసింది నాటి ప్రభుత్వం. అయితే ఈ కమిషన్ ఎలాంటి తుది నిర్ణయానికి రాకుండానే కాలపరిధి ముగిసిపోయింది. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం నదులు తమ మార్గాలను మార్చుకుంటున్న స్థితిలో భౌగోళిక వివాదాలు మరింత ముదురుతున్నాయి.

హర్యానా, ఉత్తరప్రదేశ్ ల మధ్య సైతం భౌగోళిక సరిహద్దు వివాదం ఉంది. ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 63 గ్రామాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సైతం 7 గ్రామాలకు సంబంధించి వివాదం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల పరిధిలో సైతం ఇలాంటి వివాదమే నెలకొని ఉంది. అసోం-నాగాలాండ్ మధ్య 5వేల చదరపు మైళ్ల భూభాగంపై వివాదం నెలకొని ఉంది. ఇందుకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది.

ఒకే దేశంలోని రాష్ట్రాల మధ్య వివాదం ఉండటానికి ప్రధాన కారణం నీటిలాగే భూమిని కూడా అన్ని సందర్భాల్లో కచ్చితంగా కొలవలేం. అందుకు ప్రధాన కారణం రుతువులు మారినపుడు భౌగోళిక స్వరూపాలు మారుతుంటాయి. నదులు సైతం తమ యానాన్ని మార్చుకుంటాయి. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా గంటర్ చైన్ తో కొలతలు వేసి సరిహద్దులను నిర్ధారించలేం. పరస్పర సమన్వయం, సంయమనం ద్వారా మాత్రమే ఇలాంటి వివాదాలను పరిష్కరించుకోవచ్చు. అయితే దేశ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల మధ్య ఉన్న భౌగోళిక వివాదాల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. లేకపోతే అవకాశం కోసం పొంచి ఉన్న వైరి దేశాలు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంటుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

14 − 3 =