ఇటీవల అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాము అధికారంలోకి వస్తే అసోంలో సీసీఏ అమలును రద్దు చేస్తామని ప్రకటించాడు. ఆ రాష్ట్ర మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. తమ రాష్ట్రంలో సీఏఏ చట్టాన్ని అమలు చేసి తీరుతామని.. అసోం బీజేపీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ ప్రకటించారు. తాజాగా మజులీలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. అసోం ఎలక్షన్ క్యాంపెయిన్ ఫుల్ స్వింగ్ లో వుందన్నారు. ఇప్పటికే పార్లమెంటులో బిల్ పాసైందని.. బీజేపీ దానికి కట్టుబడి వుందని తెలిపారు. సీఏఏ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే సీఏఏ ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడంపై.. రంజిత్ కుమార్ దాస్ స్పందించారు. రాహుల్ గాంధీకి సీసీఏ పట్ల ఏమాత్రం అవగాహన లేదన్నారు. సీఏఏ గురించి బీజేపీ బూత్ లెవల్ కార్యకర్తలకు తెలిసినంత కూడా రాహుల్ గాంధీకి తెలియదన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. అసోం అసెంబ్లీ ఎన్నికలపై సీఏఏ ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు రంజిత్. అసోం ప్రజలు సీఏఏకు అనుకూలంగా వున్నారని తెలిపారు. ఆ విషయం ఇఫ్పటికే ఎన్నోసార్లు స్పష్టమైందన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం ఉచ్ఛస్థితిలో వున్నప్పుడే అసోంలో పంచాయితీ ఎన్నికలు జరిగాయని.. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లోనూ సీఏఏపై కాంగ్రెస్ రాద్దాంతం చేసిందని.. అయినా, బీజేపీకే అనుకూలంగా తీర్పునిచ్చారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా సీఏఏ ప్రభావం ఉండబోదన్నారు రంజిత్. అసోం ప్రజలు భావోద్వేగంతో ఓటు వేయరని.. తార్కికంగా ఆలోచించి ఓటు వేస్తారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వున్నన్ని రోజులు.. అసోంలో ఒక్క విదేశీయుడు కూడా అడుగుపెట్టలేడని ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో వున్నారని తెలిపారు.
అటు రాహుల్ గాంధీపైనా ఇచ్చిన ఐదు ఎన్నికల హామీలపైనా రంజిత్ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఎన్ని హామీలైనా ఇస్తుందని.. ఎందుకంటే వారు ప్రస్తుతం అధికారంలో లేరని.. భవిష్యత్తులో అధికారంలోకి రారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎప్పుడూ ఆచరణయోగ్యమైన హామీలే ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో వున్నది బీజేపీయేనని.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీయేనని అన్నారు. అటు టీ ప్లాంటేషన్ వర్కర్ల వేతనం పెంపుపైనా స్పందించారు. రాహుల్ గాంధీ చెబుతున్నట్టు టీ ప్లాంటేషన్ వర్కర్లకు 365 రూపాయల వేతనం పెంచితే.. అసోంలోని అన్ని టీ తోటలు మూతపడతాయని.. ప్లాంటేషన్ వర్కర్లంతా నిరుద్యోగులవుతారని తెలిపారు.
126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మార్చి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్త కొత్త ప్రచార అస్త్రాలతో ఎదురుదాడికి దిగుతున్నారు.