Right Angle

AskKTR..? ఎవరు అంధభక్తులు..? ఎవరు దేశభక్తులు..?

నమస్తే.. భారత దేశం వాక్సిన్ పాలసి సరిగ్గా లేదని… ప్రపంచ దేశాల్లో అత్యద్భుతంగా వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంటే మన దేశంలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని… కేంద్రం విఫలమైందని .. మోదీ రిజైన్ చేయాలనీ… విపక్ష నాయకులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తెగ విమర్శలు చేస్తున్నాయి. ఇక మన తెలుగు పత్రికలూ, మీడియా ఛానళ్ల అసత్య ప్రచారాలు చెప్పనక్కర్లేదు. నిజంగా మన దేశం వాక్సినేషన్ విషయంలో అంత దారుణమైన పరిస్థితుల్లో ఉందా..? మొన్న మన తెలంగాణ యువరాజు కేటీఆర్ ట్విట్టర్ లో కొన్ని ఆరోపణలు చేసారు. అదేంటంటే…

  1. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో వాక్సినేషన్ శాతం చాలా తక్కువ ఉంది…అని కొన్ని గణాంకాలు షేర్ చేసారు.
  2. వాక్సినేషన్ పాలసి పై సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యల్ని ఉటంకించారు.
  3. అభివృద్ధి చెందిన దేశాలు గతేడాదే కోవిడ్ వాక్సిన్లు ఆర్డర్ చేశాయి… మరి భారత ప్రభుత్వం ఎందుకు ఆర్డర్ చేయలేదు..అని ప్రశ్నించారు

సాధారణంగా అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా దీదీ లాగా… కేటీఆర్ అంత దిగజారుడు వ్యాఖ్యలు ఏమీ చేయరు… కానీ ఈసారి మాత్రం వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రాన్ని విమర్శించే క్రమంలో కొంత పప్పులో కాలేసినట్టే అనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యల్ని అన్ని పత్రికలూ, ప్రసార మాధ్యమాలు బాగానే ప్రచారం చేసాయి కానీ… కేటీఆర్ షేర్ చేసిన గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే అసలు విషయాలు అర్థం అవుతాయి. అసలు వాస్తవాలను కప్పి పుచ్చుతూ ఆయన ఈ ఆధారాలు పొందు పరిచారు అని తెలుస్తుంది. కేటీఆర్ ట్విట్టర్ హేండిల్ లో పొందు పరచిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం.

ఇప్పటికి ఇజ్రాయిల్ దేశం 60 శాతం మందికి వాక్సినేషన్ చేసింది… అమెరికా 40 శాతం మందికి వ్యాక్సినేషన్ చేసింది. కానీ భారత్ మాత్రం 3.3 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేసింది అని ఒక పేపర్ కటింగ్ షేర్ చేసారు కేటీఆర్. శాతాల వారీగా ఆలోచిస్తే ఇది కరెక్టే… కానీ ఆయా దేశాల్లో ఎంత మందికి వ్యాక్సిన్లు వేశారు… మన దేశంలో ఎంత మందికి వ్యాక్సిన్లు వేసారో తెలిస్తే అయన విమర్శే పూర్తిగా తప్పు అని అర్థం అవుతుంది. ఎలాగంటే… ఆయన కోట్ చేసిన దేశాలనే తీసుకుని విశ్లేషించుకుందాం.

ఇజ్రాయిల్ లో 60 శాతం వ్యాక్సినేషన్ జరిగింది అని కేటీఆర్ చెప్తున్నారు. అసలు ఇజ్రాయిల్ జనాభా మొత్తం సుమారు 87 లక్షల 81 వేలు. సరే రౌండ్ ఫిగర్ గా… 90 లక్షలు అనుకుందాం. అంటే హైదరాబాద్ జనాభా కన్నా ఇజ్రాయిల్ జనాభా తక్కువ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక గణాంకాల ప్రకారం భారత్ జూన్ 9వ తేదీ ఉదయానికి 23 కోట్ల 90 లక్షల పైచిలుకు మందికి వ్యాక్సిన్లను వేసింది. కేవలం గడచిన 24 గంటల్లో… 27 లక్షల 76వేల 096 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇక అంతర్జాతీయ మాధ్యమం bloomberg వ్యాక్సిన్ ట్రాకర్ డేటా ప్రకారం చూసుకున్నా.. రోజుకు భారత్ సగటున 29 లక్షల పైచిలుకు మందికి వ్యాక్సినేషన్ చేస్తోంది. ఈ లెక్క ప్రకారం చూసినా… కేటీఆర్ గారు విమర్శిస్తున్నది ఎంత అసంబద్ధమో మనకు అర్థం అవుతుంది. సుమారు 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయిల్ మొత్తం దేశంలో ఇప్పటికి కేవలం 60 శాతం వ్యాక్సినేషన్ మాత్రమే జరిగింది..అంటే భారత్ వ్యాక్సినేషన్ స్పీడ్ ప్రకారం చుస్తే.. కేవలం 3-4 రోజుల్లో ఆ మొత్తం దేశానికి సరిపడా వ్యాక్సినేషన్ చేయగలుగుతుంది. ఇక కేటీఆర్ అమెరికా గురించి కూడా కోట్ చేసారు. అమెరికాలో 40 శాతం వ్యాక్సినేషన్ జరిగింది అని చెప్తున్నారు. అక్కడి జనాభా సుమారు 33 కోట్లు. భారత్ జనాభా 139 కోట్లు… అంటే… అమెరికా కంటే భారత్ జనాభా 106 కోట్లు అధికం. Bloomberg vaccine Tracker డేటా ప్రకారం అమెరికాలో మొత్తం 30 కోట్ల 39 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. భారత్ లో 23 కోట్ల 88 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. అంటే…అమెరికా కంటే మనం కేవలం 7 కోట్ల పైచిలుకు డోసులు వెనకబడి ఉన్నాం. ఇంకా 10 కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ చేస్తే… అమెరికా దేశపు జనాభాతో సమానంగా వ్యాక్సినేషన్ చేసినట్టు లెక్క. రోజుకు సగటున 20 లక్షల డోసులు వ్యాక్సినేషన్ జరిగినా… కేవలం 50 రోజుల్లో భారత్ వ్యాక్సినేషన్ అమెరికా జనాభాను అధిగమిస్తుంది. జనాభా ను ప్రస్తావిచకుండా.. వ్యాక్సినేషన్ శాతాన్ని చూపిస్తూ.. ప్రజలను తప్పుదారి పట్టించడం దేనికి సంకేతం..?

అంతేకాదు కేటీఆర్ కోట్ చేసిన మిగతా దేశాల గణాంకాలు చూద్దాం. యూకే 39.5 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేసింది అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేసారు కేటీఆర్. అయితే ఆయనకు తెలుసో తెలియదో మరి… యూకే దేశ మొత్తం జనాభాకు మూడింతల వ్యాక్సినేషన్ భారత్ లో జరిగింది. ఆ దేశం మొత్తం జనాభా 6 కోట్ల పైచిలుకు… కానీ మన దేశంలో 23 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేసాం. కానీ కేటీఆర్ మాత్రం యూకే జనాభాలో 39.5 శాతం వ్యాక్సినేషన్ జరిగింది అని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేసారు. యూకే ఇప్పటి దాకా వేసిన మొత్తం వ్యాక్సిన్లు… 6 కోట్ల 88 లక్షల పైచిలుకు. దానికి సుమారు మూడున్నర రేట్లు అధికంగా భారత్ వ్యాక్సినేషన్ చేసింది.

ఇక బ్రెజిల్ మొత్తం జనాభా సుమారు 21 కోట్లు… అయితే ఆ దేశం జనాభాలో 10.7 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగింది అని గొప్పగా చెప్తున్న కేటీఆర్ తాను ట్వీట్ చేసే రోజు జూన్ 6 వ తేదీ నాటికే భారత్ బ్రెజిల్ మొత్తం జనాభా కంటే ఎక్కువ వ్యాక్సిన్లు వేసింది. జూన్ 6 వ తేదీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 22 కోట్ల పైచిలుకు వ్యాక్సినేషన్ జరిగింది. నేటికీ బ్రెజిల్ కేవలం 7 కోట్ల 38 లక్షల పైచిలుకు మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేసింది. అంటే ఇప్పటి దాకా బ్రెజిల్ దేశం వేసిన వ్యాక్సిన్లకు సుమారు మూడింతల వ్యాక్సినేషన్ భారత్ లో జరిగింది. కానీ ఇవేవీ యువరాజు కళ్ళకు కనిపించవేమో.

ఇక కేటీఆర్ ఈ ట్వీట్ లో తెలివిగా మరో తెలివి తక్కువ పని చేసారు. అదేంటంటే పాకిస్తాన్ ను.. బంగ్లాదేశ్ లను కోట్ చేస్తూ వారి వ్యాక్సినేషన్ శాతాన్ని తమ ట్వీట్ లో పొందు పరిచారు. వ్యాక్సినేషన్ లో అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ సాగుతున్న భారత్ ను పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ల సరసన చూపించే ప్రయత్నం నిజంగా తెలివైన పని కాదు. ఆయన తన ట్వీట్ లో ఫ్యాక్ట్ మాట్లాడతాయి అని స్ట్రెస్ చేసారు….యెస్ నేను కూడా అవే factual numbers మీకు చెబుతాను. అసలు ఇప్పటి వరకు పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లకు సొంత వ్యాక్సిన్లే లేవు… కానీ వారితో మన దేశాన్ని పోల్చి విమర్శించే ప్రయత్నం చేసారు కాబట్టి ఈ వివరాలు చెబుతున్నాను. పాకిస్తాన్ ఇప్పటి దాకా కేవలం 88 లక్షల 55 వేల మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేసింది. పాకిస్తాన్ తో మొత్తం మన దేశాన్ని పోల్చనక్కర్లేదు… జస్ట్ తెలుగు రాష్ట్రాల వ్యాక్సినేషన్ గణాంకాలు పోల్చితే సరిపోతుంది. ఒక్క తెలంగాణాలో నేటికీ 70 లక్షల 20 వేల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి 10 లక్షల 37 వేల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. అంటే కేటీఆర్ గారు దేశ వ్యాప్తంగా గణాంకాలు పట్టించుకోకపోయినా… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నంబర్స్ అయినా నమ్ముతారా లేదా..? పాకిస్తాన్ దేశం మొత్తం ఇప్పటి దాక చేసిన వ్యాక్సినేషన్ కి దాదాపు సమానంగా ఒక్క తెలంగాణ లోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయినా కేవలం కేంద్రం పై విమర్శలు చేయడం కోసం భారత్ ను పాకిస్తాన్ తో పోల్చి తన స్థాయిని ఎందుకు దిగజార్చుకుంటున్నారో అర్థం కావట్లేదు.

ఇక బంగ్లాదేశ్ ఈ రోజుకి 1 కోటి 3 లక్షల వ్యాక్సిన్లు వేసింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వ్యాక్సినేషన్ కంటే కూడా ఇది తక్కువ. అందులోను బంగ్లాదేశ్ చేసిన ఈ వ్యాక్సినేషన్ డోసులు దాదాపు మొత్తం భారత ప్రభుత్వం పంపించినవే. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ఇది. మొత్తం 103 మిలియన్ల డోసులు అంటే 1 కోటి 3 లక్షల డోసులు భారత ప్రభుత్వం పంపించింది. కానీ ఇవేవీ చెప్పకుండా బాంగ్లాదేశ్ లో వ్యాక్సినేషన్ శాతాన్ని చూపించి కేటీఆర్ ప్రజల్ని మభ్యపెట్టడం తెలివైన తెలివి తక్కువ పని కాక మరేంటి.. ? తక్కువ జనాభా కలిగిన దేశాల శాతాన్ని ఎక్కువ జనాభా కలిగిన భారత్ తో పోల్చడం సరైన విశ్లేషణ ఎలా అవుతుంది..?

ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయంగా కేటీఆర్ ట్విట్టర్ లో ఇదే విషయాన్నీ చెప్పారు. 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ చేయడంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఒక నెటిజెన్ చేసిన ట్వీట్ కి స్పందిస్తూ… కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది… It’s not about how you go about vaccination; it’s more about how many people you have vaccinated. జమ్మూ కాశ్మీర్ లో వ్యూహాత్మకంగా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు అంటే… ఆలా కాదు ఎంత మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు అనేది ముఖ్యం అని చెప్పిన కేటీఆర్… భారత్ లో వ్యాక్సినేషన్ సంఖ్యను చెప్పకుండా ఆయా దేశాల వ్యాక్సినేషన్ శాతాన్ని మాత్రమే ప్రాజెక్ట్ చేయడాన్ని ఏమనాలి..?

ఇక ఆస్ట్రేలియా, US, UK, జర్మనీ, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు అన్నీ ఫ్రీగా ఆయా దేశాల్లో వ్యాక్సిన్లు అందిస్తున్నాయి అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే మన దేశంలో దానికి భిన్నమైన పరిస్థితి ఉంది అని కేటీఆర్ ట్వీటారు. సర్ కేటీఆర్ గారు… మీరు ఒక రాష్ట్ర మంత్రి… అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. భారత ప్రభుత్వం ప్రతి రోజు covid వ్యాక్సిన్ updates ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా తెలియజేస్తోంది. ఇది PIB వెబ్ సైట్ లో భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్ … ఒకసారి నేను చదువుతాను వినండి.

As part of the nationwide vaccination drive, Government of India has been supporting the States and UTs by providing them COVID Vaccines free of cost. In addition, the Govt. of India has also been facilitating direct procurement of vaccines by the States/UTs. More than 25 crore (25,06,41,440) vaccine doses have been provided to States/UTs so far, through Government of India (free of cost channel) and through direct state procurement category.

జూన్ 9వ తేదీ ప్రెస్ నోట్ ఇది… ఈ ఒక్క రోజే కాదు… ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో website లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతి రోజు వాక్సినేషన్ గణాంకాలను విడుదల చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా రాష్ట్రాలకు ఇచ్చినట్టు స్పష్టంగా ప్రకటించింది. ఇక మీదట కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుంది అని మొన్ననే ప్రధాని కూడా ప్రకటించారు. మరి కేటీఆర్ గారూ … మీరేమో మన దేశంలో వ్యాక్సిన్లు ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వట్లేదు అంటున్నారు. కేంద్రం అబద్ధాలు చెబుతోందా.. మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టా..?
ఒకవేళ కేంద్రం ప్రెస్ నోట్ తప్పు అయితే మీరు దీన్ని ఎందుకు ఖండించలేదు..? ఇక కేటీఆర్ గారు తమ ట్వీట్స్ లో సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యల్ని కోట్ చేసారు.

మిగతా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేవలం కేంద్ర ప్రభుత్వాలే పర్యవేక్షిస్తున్నాయి.. కానీ మన దేశంలో లిబరలైజ్ చేయడం వల్ల రాష్ట్రాలు వాక్సినేషన్ ప్రొక్యూర్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది అని సుప్రీమ్ కోర్టు వ్యాఖ్యానించిన మాటల్ని కేటీఆర్ ట్వీట్ చేసారు. ఈ విషయాన్నీ ప్రధాని మోడీ కూడా తన ప్రసంగం లో స్పష్టంగా చెప్పారు. మొదట కేంద్రం సమర్ధ వంతమైన వ్యాక్సిన్ స్ట్రాటజీని రూపొందించి అమలు పరచింది. కానీ విపక్ష నాయకులూ… కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మా రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడమేంటి.. ఈ పాలసీని లిబరలైజ్ చేస్తే మా వ్యాక్సిన్లను మేమే కొనుగోలు చేసుకుంటాం అని ప్రకటనలు చేసారు. కాంగ్రెస్ 50 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ ఏకంగా ప్రధానికి లేఖనే రాసారు. వ్యాక్సినేషన్ బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలని డిమాండ్ కూడా చేసారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాక్సిన్లు మేమే ప్రొక్యూర్ చేసుకుంటాం అని.. వయసు కి సంబంధించిన నిబంధనలు తామే నిర్ణయించుకుంటామని ముందు ప్రకటించి తర్వాత మాట మార్చారు.

కేంద్రం ఒక పద్దతి ప్రకారం వ్యాక్సినేషన్ చేస్తుంటే… లేని పోనీ అపోహలు సృష్టిస్తూ కొందరు నాయకులు అనవసరమైన ఆందోళన రేపారు. ఇది బీజేపీ వ్యాక్సిన్ మేము చేసుకోము అని కొందరు ప్రకటనలు చేసారు… వృద్దులకే ఎందుకు మొదట వ్యాక్సిన్ వేయాలి… మిగతా వారికీ ఎందుకు వేయొద్దు అంటూ వితండవాదం చేసారు. వ్యాక్సిన్ పూర్తి ట్రయల్స్ జరగకుండానే రిలీజ్ చేసారని… అనేక అనుమానాలు ఉన్నాయని ముందు మోడీ వాక్సిన్ వేసుకోవాలి అని అసత్య ప్రచారాలు చేసారు. కేంద్రం ఎందుకు వ్యాక్సిన్లు ఇవ్వాలి మేమే సరఫరా చేసుకుంటాం… మాకు వదిలేయండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే డిమాండ్ చేసాయి. ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకొని మొత్తం కేంద్రమే చూడాలి అంటున్నారు. ముందు మేము ఫ్రీగా వ్యాక్సిన్లు ఇస్తామని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటనలు చేసాయి… ఇప్పుడు అవే ప్రభుత్వాలు మొత్తం కేంద్రమే చూసుకోవాలి అని యూ టర్న్ తీసుకున్నాయి.

ఇక ఈ మధ్య మరో వాదన. అభివృద్ధి చెందిన అన్ని దేశాలు గతేడాది మే జూన్ నెలల్లోనే వ్యాక్సిన్ ఆర్డర్లు ఇచ్చాయి. మన దేశం జనవరి నెల వరకు ఇవ్వలేదు అని. హైలైట్ ఏంటంటే… భారత దేశం వ్యాక్సిన్ల విషయంలో అర్దార్లు లేట్ గా ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ కోసం ఎంత ఖర్చు చేసాయి… భారత దేశం ఎంత ఖర్చు చేసింది… ఎందుకు వాళ్ళు ముందు ఆర్దర్లు ఇచ్చారో చెప్తాను.

covid వాక్సిన్ తయారీ అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ … క్లినికల్ ట్రయల్స్, ప్రక్రియలో ఆయా ఫార్మా సంస్థలను భారత ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ వారికి ఆర్థికంగా నిధులు ఇవ్వలేదని సుప్రీం కోర్టులో కేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందు పరిచారు. అదే సమయంలో అగ్ర రాజ్యమైన అమెరికా వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం 9 బిలియన్ డాలర్లను 7 సంస్థలకు గ్రాంట్ల రూపంలో ఇచ్చింది. అంటే సుమారు 900 కోట్ల డాలర్లను కేవలం వ్యాక్సిన్ రీసర్చ్ కోసం అమెరికా ఖర్చు చేసింది. యూకే ప్రభుత్వం 84 మిలియన్ పౌండ్ల నిధిని covid వాక్సిన్ రీసర్చ్ కోసం కేటాయించింది. కానీ భారత్ ఫార్మా సంస్థలకు గ్రాంట్ల రూపంలో నిధులు సమకూర్చకపోయినా… మన శాస్త్రవేత్తలు… ఆహరహము శ్రమించి భారత వ్యాక్సిన్ ని తయారు చేసి ఔరా అనిపించారు.

దేశీయ ఫార్మ సంస్థలతో ICMR ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ…వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కావాల్సిన చర్యలు తీసుకున్నారు కానీ… వారికి ఆర్థికంగా చేయూతనిచ్చే స్థితి లో భారత ఆర్ధిక వ్యవస్థ లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు జాతీయ ఛానళ్లలో స్పష్టం చేసారు. సో వ్యాక్సిన్లు పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత వాటికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఆమోద ముద్ర పడిన తర్వాతనే భారత ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఫార్మా సంస్థలపై వ్యాక్సిన్ల కోసం ప్రజా ధనాన్ని విడుదల చేసిన తర్వాత ఒకవేళ ఆ ప్రయత్నం విజయవంతం కాకపోతే మళ్ళీ ఇవే విపక్షాలు ప్రజా ధనం వృధా అయిందని విమర్శించి ఉండేవి.

భారత ప్రభుత్వం ఆలస్యంగా ఆర్డర్ చేసింది అందుకే వ్యాక్సిన్ కొరత ఏర్పడింది అనే వారికీ తెలియాల్సింది ఏంటంటే… ప్రపంచం లోనే అత్యధికంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ మొదటి వరసలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. Bloomberg గణాంకాల ప్రకారం… చైనా రోజుకి సగటున 18 లక్షల 95 వేల వ్యాక్సిన్ డోసులు వేస్తుంటే… అమెరికా 10 లక్షల 74 వేల పైచిలుకు డోసుల్ని వేస్తోంది. ఆ రెండు దేశాల కన్నా ఎక్కువగా రోజుకి సుమారు 29 లక్షల సగటుతో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉంది. మిగతా దేశాలేవీ రోజుకి కనీసం 10 లక్షల మందికి కూడా వ్యాక్సినేషన్ చెయ్యట్లేదు. అయినా మన వ్యాక్సినేషన్ విఫలమైందని… కేంద్రం సరిగ్గా ప్లాన్ చేయలేదని విమర్శించే వారిని ఏమనాలి..? ఎవరు అంధ భక్తుడు… ఎవరు దేశ భక్తుడు..?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + one =

Back to top button