శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కఠిన మైన చర్యల కోసం ఆ పార్టీ చీఫ్ కు కార్యకర్తలు పూర్తి అధికారాలను కట్టబెట్టారు. శివసేన జాతీయ కార్యనిర్వహక కమిటీ సమావేశాన్ని ముంబైలోని శివసేన భవన్ లో శనివారం నిర్వహించారు.
ఈ మేరకు ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏక్ నాథ్ షిండేతో కలిసి తిరుగుబాటు చేసిన 38 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి పూర్తి అధికారాలను పార్టీ చీఫ్ కు కార్యకర్తలు ఈ సమావేశంలో కట్టబెట్టినట్టు సమాచారం. సీఎంకు కరోనా లక్షణాలు ఉండటంతో సమావేశానికి ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. ఏక్ నాథ్ నాయకత్వంలోని తిరుగుబాటు నేతలు తమ వర్గానికి ‘శివసేన బాలాసాహెబ్’అని పేరు పెట్టుకున్నారు. దీంతో పార్టీ పేరును బయటి వ్యక్తులు ఎవరూ ఉపయోగించరాదనే తీర్మానాన్ని చేశారు. అలాగే బాల్ ఠాక్రే పేరును రాజకీయాలకు ఉపయోగించరాదనేది అందులో ప్రధానమైన తీర్మానం.
ఇక 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న శివసేన ఫిర్యాదుపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ స్పందించారు. అనర్హత పిటిషన్ పై సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు పంపారు. గడువులోగా దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే వర్గం న్యాయ నిపుణుల సలహాను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు గంటల పాటు న్యాయ నిపుణులతో వారు చర్చలు జరిపినట్టు సమాచారం.
ఇక మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో రెబెల్ ఎమ్మెల్యేల నివాసాలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో శివసేన, తిరుగుబాటు ఎమ్మెల్యేల అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు జరిగి అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అలెర్టు అయ్యారు. ఈ మేరకు జూలై 10 వరకు ముంబైలో 144 సెక్షన్ ను పోలీసులు విధించారు.